ప్రస్తుతం కెరీర్ పరంగా పీక్ స్టేజ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు ఎన్టీఆర్. అతడు నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడంతో, ఎన్టీఆర్ ఆనందానికి హద్దుల్లేవ్. పైగా గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ నామినేషన్ల వరకు కూడా ఈ సినిమా వెళ్లడంతో ఎన్టీఆర్ తో పాటు టోటల్ యూనిట్ అంతా హ్యాపీగా ఉంది.
ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా మేకింగ్ ముచ్చట్లను పాశ్చాత్య మీడియాతో పంచుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో ఎన్టీఆర్ ఇంగ్లిష్ లో మాట్లాడుతున్న విధానం సోషల్ మీడియాలో విమర్శలకు తావిస్తోంది.
యూఎస్ మీడియాతో మాట్లాడుతూ, అమెరికా యాసను చూపించే ప్రయత్నం చేశాడు తారక్. అయితే అది కృత్రిమంగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి.
తెచ్చిపెట్టుకున్న యాసతో మాట్లాడే బదులు, ఇండియన్ ఇంగ్లిష్ లో మాట్లాడితే సరిపోతుందని, ఎవ్వరూ ఆమెరికా యాసలో మాట్లాడాలని డిమాండ్ చేయలేదంటూ పోస్టులు పెడుతున్నారు. ఓవైపు ఎన్టీఆర్ ఇంగ్లిష్ లో మాట్లాడుతున్న విధానానికి అతడి ఫ్యాన్స్ సంబర పడుతుంటే, మరోవైపు ఇలా అతడి యాసపై సెటైర్లు పడుతున్నాయి.
ఎన్టీఆర్ కు భాషపై మంచి పట్టుంది. ఇది ఎవ్వరూ కాదనలేని నిజం. తెలుగులో మాట్లాడినా, హిందీలో మాట్లాడినా, ఇంగ్లిష్ లో మాట్లాడినా ఎన్టీఆర్ స్పష్టంగా, అనర్గళంగా మాట్లాడగలడు. ఆర్ఆర్ఆర్ ప్రచారం టైమ్ లో ఎన్టీఆర్ హిందీలో మాట్లాడిన విధానానికి నార్త్ మీడియా ఫిదా అయింది.
కాబట్టి ఎన్టీఆర్ ఎప్పట్లానే సహజసిద్ధంగా మాట్లాడితే బాగుండేదని, ఇలా తెచ్చిపెట్టుకున్న ఇంగ్లిష్ యాసతో దొరికిపోతున్నాడని, ఫేక్ యాక్సెంట్ తో అనవసరంగా ట్రోలింగ్ కు గురవుతున్నాడని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.