ప్రధాని మోదీతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న చంద్రబాబునాయుడిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణకు కోపం వచ్చింది. సహజంగా జగన్ అంటే సీపీఐ నాయకులు నారాయణ, రామకృష్ణ ఒంటికాలిపై లేస్తుంటారు. చంద్రబాబు చెప్పినట్టు ఆడే తోలుబొమ్మలని నారాయణ, రామకృష్ణలపై విమర్శ వుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, జగన్‌పై రామకృష్ణ తన ఆగ్రహాన్ని ప్రదర్శించడం ఆసక్తికర పరిణామం.
రామకృష్ణ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్, వైఎస్సార్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పని చేశారని కొనియాడారు. కానీ వాళ్ల వారసులుగా వచ్చిన చంద్రబాబు, వైఎస్ జగన్ మాత్రం ప్రధాని మోదీకి సరెండర్ అయ్యారని దుయ్యబట్టారు. ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తున్న ప్రధాని మోదీని కనీసం ప్రశ్నించలేని దయనీయ స్థితిలో చంద్రబాబు, జగన్ ఉన్నారని తప్పు పట్టారు.
ఏపీలో జగన్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. మోదీ కనుసన్నల్లో పాలన సాగిస్తూ జనంపై ఆర్థిక భారం మోపుతున్నారని జగన్‌పై విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు మోదీ మెడలు వంచైనా ప్రత్యేక హోదా తీసుకొస్తానని ప్రగల్భాలు పలికిన జగన్, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని ముందు మెడ వంచారని విమర్శించారు.
హోదా, ఉక్కు ఫ్యాక్టరీ, నిధులపై పోరాటాలు లేవన్నారు. వాట్సప్‌లో మాత్రమే టీడీపీ, వైసీపీ పోరాటం చేసుకుంటున్నాయని దుయ్యబట్టారు. మోదీని కలిసి షేక్ హ్యాండ్ ఇస్తే, భోజనం చేస్తే గొప్పగా చంద్ర బాబు, జగన్ ప్రచారం చేసుకుంటున్నారని తప్పు పట్టారు. సిగ్గు శరం లేకుండా వాటిపై సొంత డబ్బా కొట్టుకుంటారా అని రామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రజాసమస్యల్ని వదిలేసి, ఇతరేతర వాటిపై తమ అనుకూల మీడియాల వేదికగా గొప్పలు చాటుకుంటున్న టీడీపీ, వైసీపీ నేతల్ని రామకృష్ణ దుమ్ము దులిపారు. ప్రజల ప్రయోజనాలకు సంబంధం లేని అంశాలపై చర్చిస్తూ, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖకు రైల్వే జోన్, అలాగే ఏపీలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు తదితర అంశాల్ని విస్మరించిన వైసీపీ, టీడీపీలను ఎంత విమర్శించినా తక్కువే.