విశాఖలో కీలకమైన నియోజకవర్గంగా ఉన్న గాజువాకలో ఈసారి ఎన్నికల ఫలితం ఏమిటి అన్నది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. గాజువాక పరిధిలో ఏపీకి తలమానికం అయిన ఉక్కు కర్మాగారం ఉంది. దానిని ప్రైవేట్ పరం చేయవద్దు అంటూ గత మూడేళ్లుగా వామపక్షాల ఆధ్వర్యంలో పోరాటం సాగుతోంది.
వామపక్షాలకు అనుబంధంగా ఉండే కార్మిక సంఘాలు స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని అలుపెరగని రీతిన కొనసాగిస్తున్నాయి. ఉక్కులో బలంగా ఉన్న ఈ కార్మిక సంఘాలు సార్వత్రిక ఎన్నికల్లో కీలకంగా మారుతున్నాయి. గాజువాకలో రెండున్నర లఖల దాకా ఓటర్లు ఉంటే అందులో రెండు వంతుల దాకా ఉక్కు కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని అందుకుంటున్న వారు అనుబంధ సంస్థల కార్మికులు ఉన్నారు.
వీరంతా 2019లో వైసీపీ- టీడీపీ జనసేనల మధ్య చీలిపోయారు. అప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య లేదు. ఈసారి అదే టెస్టింగ్ పాయింట్ గా మారింది. విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తోంది కేంద్రంలోని బీజేపీ. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నది టీడీపీ జనసేన. గాజువాకలో జనసేన మద్దతుతో టీడీపీ పోటీ చేస్తోంది.
వైసీపీ తరఫున మంత్రి గుడివాడ అమర్నాధ్ పోటీలో ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వమని ఈ మూడు పార్టీలు హామీ ఇస్తున్నాయి. బీజేపీ అయితే ఈ ఇష్యూనే అసలు ప్రస్తావనకు తేవడం లేదు. ఈ నేపధ్యంలో ఉక్కు కార్మికులను మంచి చేసుకోవడానికి అధికార వైసీపీ విపక్ష టీడీపీ జనసేన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.
ఈ క్రమంలో గాజువాక నుంచి పోటీకి సీపీఎం సిద్ధం అయింది. ఆ పార్టీ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఉక్కు ఉద్యమ ఫలితాన్ని రాజకీయంగా తన వైపు తిప్పుకోవడానికి సీపీఎం వ్యూహాత్కమంగా బరిలోకి దిగుతోంది. విశాఖ ఉక్కు మీద పోరాడుతున్న కార్మిక నేత సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు పోటీ చేస్తున్నారు.
ఆయన పేరుని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విజయవాడలో ఈ రొజు ప్రకటించారు. జగ్గునాయుడు ఇప్పటికే ఉక్కు కార్మికులు ఏపీలోని ప్రధాన పార్టీలు దేనికీ మద్దతు ఇవ్వవద్దటూ పిలుపు ఇచ్చి ఉన్నారు. ఆయనే ఇపుడు పోటీ చేస్తున్నారు అంటే ఉక్కు కార్మికుల ఓట్లు సీపీఎం కి వెళ్తాయనే భావిస్తున్నారు. అవి ఎంత మేరకు వెళ్తాయి. సీపీఎం ప్రభావం ఎంత అన్నది కూడా చూడాలి. ఉక్కు ప్రైవేటీకరణ ప్రభావం అధికంగా గాజువాక్లో ఉన్న నేపధ్యంలో ఇప్పటిదాకా అనుకున్న ద్విముఖ పోరు కాస్తా అక్కడ త్రిముఖ పోరుగా మారనుంది అని అంటున్నారు.