జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో ఒక రోజు ప్రచారం చేశారు. దాంతో కిందా మీద అవుతున్న టీడీపీ కూటమికి కొంతలో కొంత అయినా జోష్ వస్తుందని అంతా భావించారు. అయితే పవన్ స్పీచ్ అనుకున్నంతగా ఎఫెక్టివ్ గా లేదని పెదవి విరుస్తున్నారు.
ఆయన నీరసంగా మాట్లాడారు అంటున్నారు. బహుశా ఆయన అనారోగ్యం వల్ల కూడా కావచ్చు. కీలకమైన అంశాలలో పవన్ చెప్పిన మాటలు కూడా ఆయా వర్గాలను సంతృప్తి పరచకలేకపోయాయని అంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశమే తీసుకుంటే చంకలో బీజేపీని పెట్టుకుని జనాలను రోడ్ల మీదకు రమ్మని పోరాటాలు చేయమని పవన్ అనడమే విడ్డూరంగా ఉందని అంటున్నారు.
అనకాపల్లిలో గ్రామదేవత శ్రీ నూకాలమ్మ ప్రసిద్ధి చెందిన వారు. ఆ పండుగను రాష్ట్ర పండుగగా చేస్తామని పవన్ చెప్పడం మంచిదే. అయితే ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ రద్దు విషయంలో ఆయన కోరి కెలికారు అంటున్నారు. రద్దు చేస్తామని విస్పష్టమైన హామీ ఇవ్వలేదు. న్యాయమైన తీరులో పరిష్కరిస్తామంటే ఎలా అర్ధం చేసుకోవాలని అంటున్నారు.
ఆయన మరో మాట చెప్పారు. తనకు బలం ఉన్నా తక్కువ సీట్లకే పోటీ చేస్తున్నాను అని. అది టీడీపీకి చెప్పడానికే అంటున్నారు. కూటమి ఇచ్చిన హామీలను తీర్చకపోతే తానే నిలదీస్తాను అని పవన్ చెప్పడమూ కొత్త మాటలాగానే చూస్తున్నారు.
పవన్ పర్యటన సందర్భంగా జనసేన అభ్యర్ధితో పాటు ఆయన ఫోటో ఆ పార్టీ సింబల్ ని మాత్రమే వేసి ప్రచారం చేసుకోవడం కూడా కూటమిలో కొంత అసంతృప్తిని కలుగచేసింది అని అంటున్నారు. గతంలో ఆవేశపూరితంగా పవన్ మాట్లాడేవారు. ఈసారి మాత్రం ఆయన స్పీచ్ కొంత చప్పగానే సాగింది అని అంటున్నారు. ఆయన సారా వ్యాపారిగా సీఎం జగన్ మీద విమర్శలు చేశారు.
దీనికి వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు ఘాటు అయిన రిప్లై ఇచ్చారు. పవన్ ఏమైనా సారాయి తాగారా ఆయన జగన్ ని పట్టుకుని సారాయి వ్యాపారి అంటున్నారు అని ఫైర్ అయ్యారు. పవన్ మాటలు చూస్తూంటే ఆయన సారాయి తాగి మాట్లాడారు అని అనుకుంటున్నాను అని ఆయన ఎద్దేవా చేశారు. సారాయి వ్యాపారం జగన్ చేసినట్లుగా ఆధారాలు ఎక్కడైనా ఉన్నాయా అని నిలదీశారు.
ఇలా పవన్ విపక్షాలకు విమర్శలకు గురి అయ్యారు. కూటమికి జోష్ ని తేలేకపోయారు అని అంటున్నారు. అయితే పవన్ జ్వరంతో బాధపడుతున్నారని అందుకే ఆయన స్పీచ్ లో కొంత వాడి వేడి తగ్గిందని అని సర్దిచెప్పుకుంటున్నారు.