లెక్క మేమిస్తాం…మీరు పోటీ చేయండ‌న్నా!

క‌డప జిల్లా ప్రొద్దుటూరులో విచిత్ర ప‌రిస్థితి. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వ‌ర‌దరాజుల‌రెడ్డికి రియ‌ల్ట‌ర్లు, ఇత‌ర వ్యాపారులు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి త‌గిన‌న్ని ఆర్థిక వ‌న‌రులు లేవ‌ని…

క‌డప జిల్లా ప్రొద్దుటూరులో విచిత్ర ప‌రిస్థితి. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వ‌ర‌దరాజుల‌రెడ్డికి రియ‌ల్ట‌ర్లు, ఇత‌ర వ్యాపారులు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి త‌గిన‌న్ని ఆర్థిక వ‌న‌రులు లేవ‌ని ఎన్నిక‌ల బ‌రిలో నిలిచేందుకు త‌ట‌పటాయిస్తున్న వ‌ర‌ద‌రాజుల‌రెడ్డికి…తామున్నామంటూ కొంద‌రు వ్యాపారులు మ‌ద్ద‌తుగా నిలుస్తున్న‌ట్టు స‌మాచారం.

ప్రొద్దుటూరు నుంచి ఐదుమార్లు వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి ప్రాతినిథ్యం వ‌హించారు. ప్రొద్దుటూరు పెద్దాయ‌న‌గా ప్ర‌త్య‌ర్థులు సైతం గౌర‌వంగా పిలుచుకుంటారు. ప్రొద్దుటూరులో ఇప్పుడున్న ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి త‌దిత‌రులంతా రాజ‌కీయంగా పెద్దాయ‌న శిష్యులే. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ త‌ర‌పున ఆయ‌న ప్రాతినిథ్యం వ‌హించారు. 2014లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో టీడీపీ టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆయ‌న రాజ‌కీయంగా సైలెంట్ అయ్యారు.

ఇటీవ‌ల కాలంలో ప్రొద్దుటూరులో మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి మ‌ళ్లీ యాక్టీవ్ అయ్యారు. మిత్రులు, శ్రేయోభిలాషులు, ప్రొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల విన్న‌పం మేర‌కు తిరిగి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో చురుగ్గా పాల్గొనాల‌ని ఇటీవ‌ల వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి ప్ర‌క‌టించారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లును ఢీకొట్టాలంటే ఆర్థికంగా బ‌లంగా వుంటే త‌ప్ప‌, సాధార‌ణ నాయ‌కుల‌కు సాధ్యం కాద‌నే ప్ర‌చారం జరుగుతోంది.

ఐదు సార్లు ఎమ్మెల్యేగా వ‌ర‌ద‌రాజులరెడ్డి ప‌ని చేసిన‌ప్ప‌టికీ, రాచ‌మ‌ల్లును ఢీకొనే స్థాయిలో ఆర్థిక వ‌న‌రులు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప్రొద్దుటూరులో అధికార పార్టీ వేధింపుల వ‌ల్ల కొన్ని వ‌ర్గాల వ్యాపారులు ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నారు. ప్ర‌తి విష‌యంలోనూ వాటా అడుగుతున్నార‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ కార‌ణంగానే రాచ‌మ‌ల్లును ఎదుర్కోవాలంటే వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి మ‌ళ్లీ రాజకీయంగా యాక్టీవ్ కావాల‌ని, లెక్క ఎంతైనా తాము పెట్టుకుంటామ‌ని పెద్దాయ‌న‌కు భ‌రోసా ఇచ్చిన‌ట్టు స‌మాచారం. దీంతో ఏడు ప‌దుల వ‌య‌సులో ప్రొద్దుటూరు పెద్దాయ‌న మ‌ళ్లీ ఉత్సాహంగా ప్ర‌జ‌ల్లోకి వెళుతున్నారు.