తిరుపతి జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తెగించినట్టే కనిపిస్తోంది. వైసీపీ అధిష్టానంతో అమీతుమీ తేల్చుకునేందుకే ఆయన నిర్ణయించుకున్నాట్టు…. ఆనం ఘాటు వ్యాఖ్యలే చెబుతున్నాయి. ఇటీవల కాలంలో ఆనం రామనారాయణరెడ్డి ప్రభుత్వ, పార్టీ వ్యతిరేక కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్నటికి నిన్న ఎలాంటి అభివృద్ధి కార్యకలాపాలు సాగడం లేదని, ప్రజల వద్దకెళ్లి ఏం చెప్పాలని ఆయన బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవాళ మరోసారి ఆయన పార్టీ వ్యతిరేక స్వరాన్ని పెంచారు. పార్టీలో కొనసాగడంపై ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. డక్కిలిలో జరిగిన వైసీపీ సమన్వయకర్తల సమావేశంలో ఆనం మాట్లాడుతూ ‘నేనుండగానే మరొకరు కాబోయే ఎమ్మెల్యేనని ప్రచారం చేసుకుంటున్నారు. మరి, ఇంతకీ నేనున్నట్టా? లేనట్టా? అనే అనుమానం కలుగుతోంది. ఏడాది తర్వాత వచ్చే ఎన్నికలకి ఇప్పుడే ఎసరు పెడుతున్నారు. పెడ్తే పెట్టారు. ఇక్కడ ఉంటానా? ఇంకో దగ్గరికి వెళ్తానా? లేదంటే మా ఇంటికే పోతానా? అవన్నీ తర్వాత విషయాలు’ అని వ్యాఖ్యానించారు.
వెంకటగిరిలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి దివంగత నేదురమల్లి జనార్ధన్‌రెడ్డి తనయుడు రాంకుమార్‌రెడ్డి మధ్య వర్గ పోరు నడుస్తోంది. తనకు టికెట్ ఇస్తే వెంకటగిరి నుంచి పోటీ చేస్తానని ఇటీవల కాలంలో రాంకుమార్‌రెడ్డి పదేపదే చెబుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆనం రామనారాయణరెడ్డి ఇవాళ ఫైర్ అయ్యారు.
అలాగే ప్రభుత్వంలో తనకు ఎలాంటి ప్రాధాన్యం లేకపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వుందని, రానున్న ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి రావడంపై ఆయనకు నమ్మకం సడలినట్టు ప్రచారం జరగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే ప్రభుత్వ వ్యతిరేక గళాన్ని వినిపిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎక్కడ వుంటానో అని ఆయన ఇవాళ కామెంట్స్ వెనుక లోతైన అర్థం దాగి వుంది.
టీడీపీలో చేరి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఆనం ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇదిలా వుండగా పార్టీ, ప్రభుత్వ వ్యతిరేక కామెంట్స్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకోవడమే తరువాయిగా కనిపిస్తోంది.