చంద్రబాబు సామాజిక వర్గ నేతల ఓవరాక్షన్ అంతాఇంతా కాదు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు నేతృత్వంలో పొడిచిన వెన్నుపోటు గురించి లోకానికి ఏమీ తెలియనట్టు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వినేవాళ్లంటే టీడీపీ నేతలకు ఎంత లోకువో ఎన్టీఆర్ గురించి వారు చెబుతున్న సూక్తులే నిదర్శనం.
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి, డాక్టర్ వైఎస్సార్ నామకరణం చేయడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇది అన్యాయమనో, తాము వచ్చిన తర్వాత తిరిగి ఎన్టీఆర్ పేరు పెడతామనో ప్రకటించే వరకూ అభ్యంతరం లేదు. అబ్బే అలాంటి ప్రకటనలు ఇస్తే టీడీపీకి కుల పార్టీగా ముద్ర ఎందుకేస్తారు? మాజీ మంత్రి దేవినేని ఉమా ట్వీట్ ఏంటో ఒకసారి చూద్దాం.
‘దేశంలోనే మొదటిసారిగా ఆరోగ్యవర్సిటీని ఎన్టీఆర్ స్థాపించారు. యూనివర్సిటీ పేరు మార్పు తెలుగువారి ఆత్మ గౌరవంపై దాడి చేయడమే. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారు. ప్రజా ఉద్యమంతో మీ నియంతృత్వ పోకడలకు చరమగీతం పాడి మళ్ళీ ఎన్టీఆర్ పేరును పెట్టేలా చేస్తాం సీఎం జగన్’ అంటూ దేవినేని ఉమా ట్వీట్ చేశారు.
యూనివర్సిటీ పేరు మార్పు తెలుగువారి ఆత్మ గౌరవంపై దాడి లాంటి ఎక్స్‌ట్రా కామెంట్స్‌తోనే టీడీపీ బద్నాం అవుతోంది. అదేంటో గానీ, చంద్రబాబు సామాజిక వర్గం వారికి తప్ప మరెవరికీ ఆత్మాభిమానం, గౌరవం, వ్యక్తిత్వం ఉండవన్నట్టు వ్యవహరించడం మిగిలిన సామాజిక వర్గాలకు కోపం తెప్పిస్తోంది.
ఎన్టీఆర్‌ను రాత్రికి రాత్రే సీఎం పీఠం మీద నుంచి తోసి వేసేటప్పుడు తెలుగువారి ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పరు. ఎందుకంటే ఎన్టీఆర్‌ను వెనుకపోటు, ముందు పోటు పొడిచే హక్కు తమకే ఉందని చర్యల ద్వారా టీడీపీ నేతలు సంకేతాల్సి ఇస్తున్నారు. ఇందుకు ఉమా ట్వీట్ అతీతం కాదు.