హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టడంపై వివాదం నడుస్తోంది. ఎన్టీఆర్ పేరు తొలగింపునకు నిరసనగా అధికార సంఘం అధ్యక్ష పదవికి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేయడం తెలిసిందే. ఈ విషయమై పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.
యార్లగడ్డ రాజీనామా ఆయన సామాజిక వర్గ సమస్యగా మంత్రి అభివర్ణించారు. ఆ సామాజిక వర్గం గురించి తెలిసిందే అని కొట్టి పారేశారు. యార్లగడ్డ రాజీనామాను అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తమ ప్రభుత్వానికి నష్టమేమీ లేదన్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా మార్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అప్పుడెవరూ మాట్లాడలేదే? అని ప్రశ్నించారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి గౌరవించామన్నారు.
ఈ సందర్భంగా తన నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఉదంతాన్ని ఆయన మీడియా ఎదుట చెప్పారు. 2009లో తాను అధికార పార్టీలో ఉన్నానన్నారు. ఆ సమయంలో తన నియోజకవర్గమైన తణుకులో బీసీ కమ్యూనిటీ హాల్‌ను నిర్మించినట్టు తెలిపారు. ఆ భవనం ప్రారంభానికి రాజకీయాలకు అతీతంగా అందరినీ ఆహ్వానించి, భవనానికి పేరు సూచించాలని కోరినట్టు తెలిపారు.
అందరూ కలిసి జ్యోతిరావు పూలే పేరు పెట్టామన్నారు. ఇదే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యోతిరావు పూలే పేరు తొలగించి మున్సిపాలిటీలో తీర్మానించి ఎన్టీఆర్ పేరు పెట్టారని చెప్పుకొచ్చారు. తిరిగి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ జ్యోతిరావుపూలే పేరే పెట్టామన్నారు.
ఆరోగ్య శ్రీ అంటే వైఎస్ గుర్తుకు వస్తారన్నారు. వైఎస్సార్ హయాంలో మూడు, ఆయన కుమారుడైన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో 17 వైద్యశాలలు ఏర్పాటయ్యాయని, అందుకే వైఎస్సార్ పేరును హెల్త్ యూనివర్సిటీకి పెట్టినట్టు మంత్రి తెలిపారు.