ఒక్క రోజులో మూడు పదవులు పోయాయి

పదవులు అన్నవి తాత్కాలికాలు అని చెప్పాలి. అవి ఎలా ఎపుడు ఎవరికి వరిస్తాయో తెలియదు. వచ్చినపుడు దక్కినపుడు వాటిని శాశ్వతం అనుకుంటారు. కానీ ఎలా వస్తాయో అలాగే వెళ్లిపోతాయి. తెలుగుదేశంలో చాలా కాలం ఉంటూ…

పదవులు అన్నవి తాత్కాలికాలు అని చెప్పాలి. అవి ఎలా ఎపుడు ఎవరికి వరిస్తాయో తెలియదు. వచ్చినపుడు దక్కినపుడు వాటిని శాశ్వతం అనుకుంటారు. కానీ ఎలా వస్తాయో అలాగే వెళ్లిపోతాయి. తెలుగుదేశంలో చాలా కాలం ఉంటూ వచ్చిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కి రాజ్యసభ ఎంపీ సీటు అప్పట్లో దక్కింది. ఆ తరువాత మళ్ళీ చాన్నాళ్ళకు జగన్ అధికారంలోకి రావడంతో ఆయనకు ఏకంగా ఒకటి కాదు మూడు పదవులు దక్కాయి.

వైఎస్సార్ తరువాత అధికార భాషా సంఘం పదవులను ఎవరూ భర్తీ చేయలేదు. దాన్ని ఏర్పాటు చేసి యార్లగడ్డను మొదటి చైర్మన్ గా జగన్ నియమించారు. దాంతో పాటు తెలుగు ప్రాధికారిక సంస్థను కూడా ఏర్పాటు చేసి దానికి ఆయన్నే అధ్యక్షుడిని చేశారు. ఇక హిందీ అకాడమీని కూడా ఏపీలో ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా యార్లగడ్డకే పట్టం కట్టారు.

ఇలా మూడు కీలకమైన పదవులు మూడున్నరేళ్ళుగా క్యాబినేట్ ర్యాంక్ తో యార్లగడ్డ అధికార వైభోగం బాగానే సాగింది. ఆయన కూడా వీలు దొరికినపుడల్లా జగన్ ని మించిన వారు లేరు అని చెబుతూ వచ్చారు. ఇలా సాగిపోతున్న కధ అడ్డంగా తిరుగుతుందని బహుశా ఆయన కూడా అనుకోని ఉండరు.

విజయవాడలో ఎన్టీయార్ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీయార్ పేరుని తొలగించి వైఎస్సార్ పేరు పెట్టినందుకు నిరసంగా ఆయన ఒకే సారి మూడు పదవులకు రాజీనామ అని ప్రకటించేశారు. ముందు రోజు రాత్రి వరకూ తెలుగు భాష ప్రభుత్వ శాఖలలో అమలు అంటూ జిల్లాలలో తిరిగిన యార్లగడ్డ తెల్లారుతూనే మాజీ అయిపోయారు. 

ఇది ఆయన క్షణాలలో తీసుకున్న నిర్ణయమా లేక వేరే ఇతర కారణాలు ఉన్నాయా అన్నది తెలియదు కానీ ఏడు పదుల వయసు దాటిన యార్లగడ్డ జీవిత చరమాంకంలో మళ్ళీ కొత్త పదవులు వస్తాయా అంటే చూడాలి.