మంత్రి రోజాతో తిరుపతి జనసేన చోటా నాయకులు ఏదో ఒక వివాదం పెట్టుకుంటుంటారు. నిజానికి రోజాతో వారికి ఎలాంటి రాజకీయ సంబంధం లేదు. ఆర్కే రోజా నగరికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఏదైనా వుంటే అక్కడి జనసేన నాయకులో, కార్యకర్తలో చూసుకుంటారు. కానీ పవన్‌కల్యాణ్‌ను రోజా విమర్శిస్తే తిరుపతి జనసేన చోటా నాయకులు, ఆ పార్టీ మహిళలు రియాక్ట్ కావాల్సి వస్తోంది.
మరీ ముఖ్యంగా రోజాతో వీరి వివాదం ఎందుకయ్యా అంటే… ఆసక్తికర అంశం వెలుగు చూసింది. రోజాపై ఏం మాట్లాడినా మీడియా అటెన్షన్ వుంటుందని, పవన్‌కల్యాణ్ దృష్టిలో పడొచ్చనే చిల్లర ప్రచార పిచ్చితో ఇదంతా చేస్తున్నారనే వాస్తవం బయటికొచ్చింది. ఇటీవల పవన్‌కల్యాణ్‌పై రోజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దమ్ముంటే సింగల్‌గా రావాలని, కనీసం కౌన్సిలర్‌గానో, సర్పంచ్‌గానో గెలిచి, జగన్‌పై విమర్శలు చేయాలని పవన్‌కు రోజా హితవు చెప్పారు.
అలాగే తన నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడే వాళ్లకు దమ్ము, ధైర్యం వుంటే నగరిలోని తన ఇంటి వద్దకు రావాలని రోజా సవాల్ విసిరారు. దీంతో తిరుపతి జనసేన నాయకులమంటూ కొందరు ఎగేసుకుంటూ మీడియా ముందుకెళ్లారు. రోజా సవాల్‌ను స్వీకరించామని, ఆమె ఇంటి ముట్టడికి వెళతామని ప్రగల్భాలు పలికారు. తాము నగరికి వెళుతున్న విషయాన్ని ప్రత్యేకంగా పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో ఇవాళ ఉదయం సదరు జనసేన చోటా నాయకులు, మహిళల ఇంటికి పోలీసులు వెళ్లారు. వారిని హౌస్ అరెస్ట్ చేశారు. తిరుపతి జనసేన నేతల వైఖరిని గమనిస్తే… పొరపాటున కూడా స్థానిక ప్రత్యర్థి పార్టీ నాయకులను విమర్శించరు.
ఎందుకంటే వీళ్ల దొంగ టికెట్ల వ్యాపారం గురించి తిరుపతి, చంద్రగిరి వైసీపీ నాయకులకు బాగా తెలుసు. అధికార పార్టీ నేతల్ని ఏ మాత్రం ఎక్కువ తక్కువలు మాట్లాడినా జైల్లో కూచోపెడతారని భయం. పాపం రోజాకు ఆ అవకాశం లేకపోవడం, ఆమెపై అవాకులు చెవాకులు పేలితే ఉచిత ప్రచారంతో పాటు పార్టీ పెద్దల దృష్టిలో పడతామనే కుయుక్తులతో నాటకాలాడుతున్నారనే విమర్శలున్నాయి.