వానొచ్చె… వ‌జ్రాల వేట మొద‌లెట్టె!

రాయ‌ల‌సీమ ర‌త‌నాల సీమ అని ఎవ‌ర‌న్నారో గానీ, అక్క‌డ కొన్ని బంగారు గనులున్నాయి. వ‌ర్షం కురిస్తే మ‌ట్టి నుంచి వ‌జ్రాలు బ‌య‌ట‌ప‌డే ప్రాంతాలు కొన్ని వున్నాయి. ఉమ్మ‌డి అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాల్లో వ‌ర్షాకాలంలో వ‌జ్రాల…

రాయ‌ల‌సీమ ర‌త‌నాల సీమ అని ఎవ‌ర‌న్నారో గానీ, అక్క‌డ కొన్ని బంగారు గనులున్నాయి. వ‌ర్షం కురిస్తే మ‌ట్టి నుంచి వ‌జ్రాలు బ‌య‌ట‌ప‌డే ప్రాంతాలు కొన్ని వున్నాయి. ఉమ్మ‌డి అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాల్లో వ‌ర్షాకాలంలో వ‌జ్రాల వేట గురించి వింటుంటాం. ఇప్పుడు వాన‌లు మొద‌లు కావ‌డంతో వ‌జ్రాల కోసం వేట స్టార్ట్ చేశారు.

క‌ర్నూలు జిల్లా తుగ్గిలి, జొన్న‌గిరి, అలాగే అనంత‌పురం జిల్లా వ‌జ్ర‌క‌రూరులో వ‌జ్రాల కోసం వేట మొద‌లైంది. తొల‌క‌రి జ‌ల్లుల‌కు పొలాల్లో వ‌జ్ర రాళ్లు బ‌య‌ట‌ప‌డుతుంటాయి. చిన్న రాయి దొరికినా చాలు త‌మ జీవితాలు మారిపోతాయ‌నే ఆశ‌తో జ‌నం పెద్ద ఎత్తున సంబంధిత గ్రామాల్లో జ‌ల్లెడ ప‌డుతున్నారు. అది కూడా వ‌ర్షాల స‌మ‌యంలోనే.

సాధార‌ణంగా జూన్‌, జూలై మాసాల్లో వ‌ర్షాలు ప‌డుతుంటాయి. ఈ ఏడాది కాస్త ముందుగానే జ‌ల్లులు కురుస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తుగ్గిలి, వ‌జ్ర‌క‌రూరు పొలాల్లో స్థానికుల‌తో పాటు స‌మీపంలోని క‌ర్నూలు, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు వెతుకులాట ప్రారంభించారు. 

గ‌తంలో చాలా మందికి వ‌జ్రాలు దొరికిన ఉదంతాలున్నాయి. ఈ నేప‌థ్యంలో అదృష్టం త‌మ‌ను వ‌రించొచ్చ‌నే న‌మ్మ‌కంతో ప్ర‌జ‌లు భారీ సంఖ్య‌లో సంబంధిత ప్రాంతాల‌కు వెళుతున్నారు. వీరిలో ఉద్యోగులు సైతం ఉన్నారు. ఉద‌యాన్నే వెళ్లి సాయంత్రం వ‌ర‌కు వెతుకుతున్నారు. 

ఇదిలా వుండ‌గా వ‌జ్ర వ్యాపారులు కూడా ఆ ప్రాంతాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించారు. త‌మ మ‌నుషుల్ని స‌మీప ప్రాంతాల్లో ఉంచుతున్నారు. ఎవ‌రికైనా వ‌జ్రాన్ని పోలిన చిన్న రాయి దొరికినా, దాని నిగ్గు తేల్చేందుకు వ్యాపారులు రెడీగా ఉంటున్నారు. వ‌జ్రం దొరికితే చాలు జీవితం సుసంప‌న్నం అవుతుంద‌నే ఆశ వారిలో స‌హనాన్ని పెంచుతోంది. ఈ రోజు కాకుంటే రేపైనా త‌మ ప్ర‌య‌త్నం ఫ‌లించ‌క‌పోతుందా? అని రోజుల త‌ర‌బ‌డి వ‌జ్రాల కోసం అన్వేష‌ణ సాగిస్తున్న జ‌నం ఉన్నార‌ని చెబుతున్నారు.