బాబుకు శిక్ష‌.. లోకేశ్‌, లోకం అభిప్రాయాల‌కు ఎంత తేడా?

త‌న తండ్రి చంద్ర‌బాబునాయుడిని రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో చూసి త‌ట్టుకోలేక‌పోయాన‌ని నారా లోకేశ్ వాపోయారు. కుమారుడిగా ఆయ‌న బాధ ప‌డ‌డాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. ఢిల్లీ వేదిక‌గానే లోకేశ్ త‌న కార్య‌క‌లాపాల‌ను సాగిస్తున్నారు. సీఐడీ విచార‌ణ…

త‌న తండ్రి చంద్ర‌బాబునాయుడిని రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో చూసి త‌ట్టుకోలేక‌పోయాన‌ని నారా లోకేశ్ వాపోయారు. కుమారుడిగా ఆయ‌న బాధ ప‌డ‌డాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. ఢిల్లీ వేదిక‌గానే లోకేశ్ త‌న కార్య‌క‌లాపాల‌ను సాగిస్తున్నారు. సీఐడీ విచార‌ణ నిమిత్తం మ‌రో రెండు రోజుల్లో ఆయ‌న ఏపీకి రానున్నారు. ఈ నేప‌థ్యంలో ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు.

బాబుకు న్యాయం జ‌ర‌గ‌డంలో జాప్యం కావ‌డాన్ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. ఒక ర‌కంగా ఇది బాబుకు శిక్ష వేయ‌డం లాంటిద‌నే అభిప్రాయాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. బాబు లాంటి మ‌హానాయ‌కుడికే కోర్టుల్లో న్యాయం జ‌ర‌గ‌క‌పోతే, ఇక సామాన్యుల మాటేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. అయితే బాబుకు న్యాయం విష‌యంలో లోకేశ్ , లోకం అభిప్రాయాల‌కు పూర్తి వైరుధ్యం వుంది. అదేంటో చూద్దాం. మొద‌ట లోకేశ్ ఏమ‌న్నారో తెలుసుకుందాం.

‘చంద్రబాబును జైల్లో చూసి తట్టుకోలేకపోయాను. ఆయనకు న్యాయం అందడంలో ఆల‌స్య‌మ‌వుతోంద‌ని ఈ దేశ పౌరుడిగా నా అభిప్రాయం. ఆలస్యం జరగడమే ఒక శిక్షగా భావిస్తాను. దీనివల్ల ఆయన పౌర హక్కులు కోల్పోవడం లేదా? ఏ తప్పూ చేయకపోయినా న్యాయం ఆలస్యమవుతుంటే సామాన్యుడి మాటేంటి?’ అని లోకేశ్ ప్ర‌శ్నించారు. ఇదీ తండ్రి కేసుకు సంబంధించి లోకేశ్ అభిప్రాయం. ఇదే సంద‌ర్భంలో బాబు కేసుల‌పై లోకం అభిప్రాయం మ‌రోలా వుంది.

‘చంద్ర‌గిరి నియోజ‌క వ‌ర్గం నారావారిప‌ల్లెలో రెండెక‌రాల చంద్ర‌బాబునాయుడు వేలాది కోట్ల‌కు అధిప‌తి ఎలా అయ్యారు? హెరిటేజ్ ద్వారా పాలు, పెరుగు, కూర‌గాయ‌లు అమ్మితే ఇంత సంప‌ద‌కు అధిప‌తి కాగ‌ల‌రా? రాజ‌కీయాల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేలాది కోట్ల ఆస్తుల్ని కూడ‌బెట్టుకున్నారు. ఎవ‌రైనా కేసులు వేస్తే వ్య‌వ‌స్థ‌ల్లో త‌న‌కున్న ప‌లుకుబ‌డిని వాడుకుని వాటి నుంచి ఇంత కాలం త‌ప్పించుకుంటూ వ‌చ్చారు. స్టేల‌పై ఏళ్ల తర‌బ‌డి బ‌య‌ట తిరుగుతున్నారు. 

బాబు చేసిన నేరాలు, ఘోరాల‌కు ఇంత కాలం శిక్ష ప‌డ‌క‌పోవ‌డ‌మే అన్యాయం. వేల కోట్ల ప్ర‌జాధ‌నాన్ని కొల్ల‌గొట్టే చంద్ర‌బాబు లాంటి వాళ్లు ఎలాంటి శిక్ష‌ల‌కు గురి కాకుండా బ‌య‌ట తిరుగుతూ, పాల‌కుల అవ‌తారం ఎత్తి సామాన్యుల‌పై పెత్త‌నం చెలాయించ‌డం ఏంటి? బాబును క‌నీసం ఈ మాత్ర‌మైనా జైల్లో పెట్ట‌డం ద్వారా ఇంకా న్యాయం బ‌తికే వుంద‌ని ఇప్పుడిప్పుడే అర్థ‌మ‌వుతోంది’ అని సామాన్య జ‌నం చ‌ర్చించుకుంటున్నారు.