సలార్ సినిమా వస్తోంది అంటే మన సినిమాలు దానికి అటు ఇటు దూరంగా వున్నాయి. ఆ సినిమా అనుకున్న డేట్ కు రాకపోతే, చకచకా మూడు సినిమాలు ఆ డేట్ కు వచ్చాయి. ఆ తరవాత సలార్ ఎప్పుడు వచ్చి పడుతుందా అని ఒకటే టెన్షన్.
నవంబర్, డిసెంబర్, జనవరి.. ఇలా రకరకాల గ్యాసిప్ లు. దాంతో నిర్మాతలకు టెన్షన్. ఎక్కడ తమ సినిమా మీదకు వచ్చి పడుతుందా అని భయం. ఆఖరికి డిసెంబర్ 22న విడుదల అనగానే అక్కడ రుమాలు వేసుకున్న సినిమాలు అన్నీ అటు ఇటు జరిగిపోయాయి.
కట్ చేస్తే.. గుంటూరుకారం సినిమా జనవరిలో పండగకు వస్తోంది. అలవైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత త్రివిక్రమ్ చేస్తున్న సినిమా. చాలా కాలం తరువాత మహేష్ బాబు కాంబినేషన్. చాలా అంటే చాలా అంచనాలు వున్నాయి. రెండు వందల కోట్ల బడ్జెట్. అలాంటి భారీ సినిమా వస్తుంటే కూడా అరడజను సినిమాలు వచ్చి మీద పడుతున్నాయి.
రవితేజ ఈగిల్, రజనీ తమిళ డబ్బింగ్ సినిమా, వెంకటేష్ సైంధవ్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్, తేజ సజ్జా హనుమాన్ ఇలా అయిదు సినిమాలు పండగకు పక్కా అని ఢంకా భజాయించి ఒకటికి పది సార్లు చెబుతున్నారు. అదే చిత్రంగా వుంది. దీనికి ఒకటే కారణం. ఇప్పటి వరకు గుంటూరు కారం నుంచి పాటలు బయటకు రాలేదు. టీజర్ రావాల్సి వుంది. ఈ రెండు వస్తే అప్పుడు గుంటూరు కారం మీద కాస్త భయం వస్తుందేమో? చూడాలి.