ఆల్రెడీ అక్టోబర్ మాసం మొదలైంది. ఈ నెలకు బాక్సాఫీస్ ఓపెన్ కావాలంటే, శుక్రవారం వరకు ఆగాలి. అయితే అక్టోబర్ లో అసలైన హీట్ కావాలంటే మాత్రం దసరా వరకు ఆగాల్సిందే. ఈ నెలలో దసరాకు ముందు, దసరా తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. కేవలం దసరా మాత్రమే ఆకర్షిస్తోంది.
అక్టోబర్ మొదటివారం, 6వ తేదీకి 6 సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. రూల్స్ రంజన్, మ్యాడ్, మామా మశ్చీంద్ర, మంత్ ఆఫ్ మధు సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. వీటి ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. వీటిలో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్న మూవీ మామా మశ్చీంద్ర.
కెరీర్ లో తొలిసారి సుధీర్ బాబు త్రిపాత్రాభినయం చేసిన సినిమా ఇది. నటుడు-దర్శకుడు హర్షవర్థన్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఈషారెబ్బా, మిర్నాలినీ రవి హీరోయిన్లుగా నటించారు. ట్రయిలర్ తో ఈ సినిమా ఎట్రాక్ట్ చేస్తోంది.
ఇక ఇదే వారం కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్ రంజన్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ నుంచి మ్యాడ్ అనే సినిమాలొస్తున్నాయి. రూల్స్ రంజన్ కోసం గట్టిగా ప్రచారం చేస్తున్నాడు అబ్బవరం. ఇక మ్యాడ్ నుంచి కూడా జోరుగా ప్రమోషన్స్ సాగుతున్నాయి.
ఈ సినిమాలతో పాటు కలర్స్ స్వాతి నటించిన మంత్ ఆఫ్ మధు కూడా విడుదలకు సిద్ధమైంది. మరోవైపు 800, చిన్నా అనే రెండు డబ్బింగ్ సినిమాలు కూడా శుక్రవారమే థియేటర్లలోకి వస్తున్నాయి.
అక్టోబర్ రెండో వారం రిలీజెస్ పై ఇంకా పూర్తిస్థాయిలో క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికి రాక్షస కావ్యం, మిస్టరీ అనే సినిమాలు మాత్రమే ఆ స్లాట్ లో కనిపిస్తున్నాయి. గాడ్ అనే డబ్బింగ్ సినిమా కూడా వచ్చే అవకాశం ఉంది. మొదటివారం ముగిసిన తర్వాత రెండో వారానికి మరికొన్ని చిన్న సినిమాలు యాడ్ అవుతాయి.
దసరా సీజన్ రాకతో, మూడో వారంలో అసలైన పోటీ మొదలుకానుంది. అక్టోబర్ 19న భగవంత్ కేసరి థియేటర్లలోకి వస్తోంది. అనీల్ రావిపూడి-బాలకృష్ణ ఫ్రెష్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ కాజల్, హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల నటించారు. పాటను మినహాయిస్తే, మిగతా ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక భగవంత్ కేసరి రిలీజైన 24 గంటల వ్యవథిలోనే అంటే, అక్టోబర్ 20కి రవితేజ సినిమా టైగర్ నాగేశ్వరరావు వస్తోంది. ఈ సినిమా కూడా పాటలు పక్కనపెడితే, టీజర్ తో ఎట్రాక్ట్ చేస్తోంది. రవితేజ కెరీర్ లోనే ప్రాపర్ పాన్ ఇండియా మూవీగా ఇది రిలీజ్ కాబోతోంది. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన నుపుర్ సనన్, గాయత్రి భరధ్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాతో ఒకప్పటి నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ రీఎంట్రీ ఇస్తున్నారు.
భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావుతో పాటు.. దసరా సీజన్ లో విజయ్ హీరోగా నటించిన లియో కూడా రిలీజ్ అవుతోంది. ఈమధ్య టాలీవుడ్ లో విజయ్ కు కూడా మార్కెట్ పెరగడం, పైగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ లాంటి పెద్ద సంస్థ, ఈ సినిమాతో డిస్ట్రిబ్యూషన్ లోకి అడుగుపెట్టడంతో.. దసరాకు త్రిముఖ పోటీ అనివార్యమైంది.
నాలుగో వారంలో కూడా దసరా సినిమాల హవా కొనసాగుతుంది కాబట్టి, ప్రస్తుతానికి ఆ వారానికి సినిమాలేవీ షెడ్యూల్ కాలేదు. సంపూర్ణేష్ బాబు నటిస్తున్న మార్టిన్ లూథర్ కింగ్ అనే రీమేక్ సినిమా మాత్రమే అక్టోబర్ 27కి షెడ్యూల్ అయింది.