వైఎస్‌, నారా కుటుంబ స‌భ్యుల మ‌ధ్య తేడా!

క‌ష్ట కాలం వ‌చ్చిన‌ప్పుడు ధైర్యంగా ఎదుర్కోవ‌డంలో వైఎస్‌, నారా చంద్ర‌బాబునాయుడి కుటుంబ స‌భ్యుల‌కు మ‌ధ్య తేడా స్ప‌ష్టంగా క‌నిపించింది. ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉండ‌గా వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆక‌స్మిక మ‌ర‌ణం చెందారు. ఆ త‌ర్వాత వైఎస్సార్…

క‌ష్ట కాలం వ‌చ్చిన‌ప్పుడు ధైర్యంగా ఎదుర్కోవ‌డంలో వైఎస్‌, నారా చంద్ర‌బాబునాయుడి కుటుంబ స‌భ్యుల‌కు మ‌ధ్య తేడా స్ప‌ష్టంగా క‌నిపించింది. ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉండ‌గా వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆక‌స్మిక మ‌ర‌ణం చెందారు. ఆ త‌ర్వాత వైఎస్సార్ కుమారుడు వైఎస్ జ‌గ‌న్‌కు కాంగ్రెస్‌తో విభేదాలు వ‌చ్చాయి. దీంతో కాంగ్రెస్‌ను వైఎస్సార్ కుటుంబం వీడాల్సి వ‌చ్చింది.

ఆ త‌ర్వాత వైఎస్సార్ త‌న‌యుడు వైఎస్ జ‌గ‌న్‌పై నాడు కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం సీబీఐ, ఈడీ కేసులు పెట్టింది. జ‌గ‌న్‌ను జైలుపాలు చేసింది. వైఎస్ జ‌గ‌న్‌ను అరెస్ట్ చేసి జైలుకు త‌ర‌లించ‌గా, ఆయ‌న కుటుంబ స‌భ్యులైన వైఎస్ విజ‌య‌మ్మ‌, భార‌తి, ష‌ర్మిల త‌దిత‌ర కుటుంబ స‌భ్యులంతా హైద‌రాబాద్ న‌డివీధిలో నిర‌స‌న‌కు దిగారు.

జ‌గ‌న్ త‌ల్లి, భార్య‌, చెల్లి న‌డిరోడ్డుపై నిస్స‌హాయ స్థితిలో వుండ‌డం చూసి రెండు తెలుగు రాష్ట్రాల్లోని వైఎస్సార్ అభిమానుల మ‌న‌సు ఆక్రోశించింది. అయ్యో… అంత‌టి వైఎస్సార్ కుటుంబాన్ని వీధిన ప‌డేశార‌నే ఆవేద‌న ప్ర‌తి ఒక్క‌రిలోనూ క‌లిగింది. అంతెందుకు, తెలంగాణ‌లో సొంత రాజ‌కీయ కుంప‌టి పెట్టుకున్న వైఎస్ ష‌ర్మిల‌ను అరెస్ట్ చేయ‌గా విజ‌య‌మ్మ నేరుగా రంగంలోకి దిగారు. త‌న కుమార్తెను విడిచిపెడ్తారా? లేదంటే దీక్ష చేప‌ట్టాలా? అని తెలంగాణ పోలీసుల్ని హెచ్చ‌రించారు. ఈ సంద‌ర్భంగా త‌న‌ను అడ్డుకున్న కానిస్టేబుల్‌పై విజ‌య‌మ్మ చేయి చేసుకున్నార‌నే ప్ర‌చారం జ‌రిగింది.

ప్ర‌స్తుతం చంద్ర‌బాబునాయుడి అరెస్ట్ విష‌యానికి వ‌ద్దాం. నంద్యాల‌లో చంద్ర‌బాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసి విజ‌య‌వాడ‌కు తీసుకొచ్చింది. చంద్ర‌బాబు కుటుంబ స‌భ్యుల్లో ఏ ఒక్క‌రైనా వైఎస్సార్ కుటుంబ స‌భ్యుల మాదిరిగా నిర‌స‌న‌కు దిగారా? అంటే… లేద‌నే స‌మాధానం వ‌స్తుంది. కేవ‌లం చంద్ర‌బాబును చూడ‌డానికే , ఆయ‌న‌తో మాట్లాడ్డానికే నారా లోకేశ్‌, భువ‌నేశ్వ‌రి, బ్రాహ్మ‌ణి ఆస‌క్తి చూపారు. బాబును కుటుంబ స‌భ్యులు క‌లిసిన త‌ర్వాత‌, లోకేశ్ మిన‌హాయించి మ‌రెవ‌రూ ఇప్ప‌టి వ‌ర‌కూ క‌నిపించ‌లేదు.

నారా, నంద‌మూరి కుటుంబాల్లో లెక్కించ‌లేనంత జ‌నాభా ఉన్నారు. ఎన్టీఆర్‌, చంద్ర‌బాబునాయుడు హోదాల‌ను అడ్డం పెట్టుకుని ఎంజాయ్ చేయ‌డానికి త‌ప్పిస్తే, క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు ధైర్యంగా ఎదుర్కొనే ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా కనిపించ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.