కూటమి పాలన ఇప్పుడిప్పుడే నడక స్పీడ్ అందుకుంటోంది. ముఖ్యంగా కూటమి మేనిఫెస్టోపై స్పష్టత వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థుల నుంచి విమర్శలు కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి. కూటమి హామీలకు సంబంధించి అమల్లో తేడాలు కనిపిస్తుండడంతో టీడీపీ వెబ్‌సైట్ నుంచి మ్యానిఫెస్టో తొలగిస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఇలాంటి చర్చ తెరపైకి రావడానికి బలమైన కారణం లేకపోలేదు.
2014 ఎన్నికలప్పుడు చంద్రబాబు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలుకు నోచుకోలేదు. దీంతో ఆ పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లో మ్యేనిఫెస్టోను లేకుండా చేశారు. ఇప్పుడు కూడా కూటమి మ్యేనిఫెస్టోకు అదే దుస్థితి పడుతుందనే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
ఉచిత ఇసుక, తల్లికి వందనం పథకాల విషయంలో కూటమి ప్రభుత్వంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెజార్టీ అభిప్రాయం మాత్రం.. అంతా మోసం గురూ అనే మాట బలంగా వినిపిస్తోంది. ఇక రైతు భరోసా, మహిళలకు ప్రతి నెలా రూ.1500, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఇంకా చాలా సంక్షేమ పథకాలు అమలుకు నోచుకోవాల్సినవి ఉన్నాయి.
సామాజిక సాధికారత పింఛన్ సొమ్మును రూ.4 వేలకు పెంచి శభాష్ అనిపించుకున్నారు. ఇది మినహా, ఉచిత ఇసుక, తల్లికి వందనం విషయంలో టీడీపీ, జనసేన నాయకులు చెప్పిందొకటి, చేసిందొకటి అని ఎక్కువ మంది విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో హామీల్ని నిలబెట్టుకోలేని పరిస్థితిలో టీడీపీ తన వెబ్‌సైట్ నుంచి కూటమి మ్యానిఫెస్టోను తొలగిస్తుందనే ప్రచారం ఊపందుకుంది. కానీ ఇప్పటి వరకైతే అలాంటిది జరగలేదు.
టీడీపీ అధికారిక వెబ్‌సైట్‌ను తెరిస్తే… నిక్షింతగా కూటమి మ్యేనిఫెస్టో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఫొటోలతో కనిపిస్తోంది. మ్యానిఫెస్టోపై క్లిక్ చేస్తే… హామీలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఇందులో బాబు సూపర్ సిక్స్ పథకాల వివరాలకు అగ్రస్థానం.
20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, స్కూల్‌కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం పథకాలతో పాటు మరో మూడు సంక్షేమ పథకాల వివరాలను సూపర్ సిక్స్ కింద పొందుపరిచారు.
ప్రత్యర్థులు విమర్శిస్తున్నట్టుగా టీడీపీ వెబ్‌సైట్ నుంచి మ్యానిఫెస్టోను తొలగించే అవకాశం ఈ దఫా రాకపోవచ్చు. తల్లికి వందనం ప్రతి విద్యార్థికి అని హామీ ఇచ్చినప్పటికీ, కనీసం ఒకరికైనా ఇవ్వాలనే ఆలోచనతో వుండడం వల్ల, అమలు చేసినట్టుగానే భావిస్తారు. అలాగే మిగిలిన సంక్షేమ పథకాల అమలుకు ఇంకా సమయం ఉండడంతో, మ్యానిఫెస్టో తొలగింపు ప్రశ్నే ఉత్పన్నం కాదనే అభిప్రాయం టీడీపీ నాయకుల నుంచి వస్తోంది. తాజాగా కూటమి మ్యానిఫెస్టోపై ప్రచారం ఏదైనప్పటికీ, కాలం అన్నింటికి జవాబు చెబుతుంది. అంత వరకూ అందరూ ఓపిక పట్టాల్సిందే.