చంద్రబాబునాయుడి ప్రభుత్వం కొలువుదీరి సరిగ్గా నెలైంది. గత నెల 12న కూటమి ప్రభుత్వం ప్రధాని మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా తదితర ప్రముఖుల సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజు హామీలకు అమలుకు సంబంధించి ఎలాంటి సంతకాలు చేయలేదు. ఆ తర్వాత సీఎంగా బాధ్యతలు తీసుకున్న రోజు ఐదు ఫైళ్లపై సంతకాలు చేసి, అనుమానాలకు చెక్ పెట్టారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మెగా డీఎస్సీ, నైపుణ్య గణన, పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైళ్లపై సంతకాలు చేశారు. వీటిలో పింఛన్ల పెంపు ఆర్థికంగా ప్రభుత్వంపై పెనుభారం మోపుతుంది. అయినప్పటికీ సంబంధిత లబ్ధిదారుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం… టీడీపీ శ్రేణులకు సంతోషాన్ని ఇస్తోంది. గతంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు చంద్రబాబు ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ వచ్చిన తర్వాత వాటిని మూసివేసింది. అందుకే దాన్ని ఎన్నికల కార్యక్రమంగా కాకుండా, పేదల కడుపు నింపే మంచి పనిగా భావించి, ఎన్టీఆర్ పేరుతో ప్రారంభించడం శుభపరిణామం.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసే ఫైల్‌పై సంతకం చేయడం వరకు ఒకే. అయితే దాన్ని లేకుండా చేయడం అంత సులువా? అనేది ప్రశ్న. నైపుణ్య గణన ప్రజలపై పెద్దగా ప్రభావం చూపేది కాదు.
ఇక మెగా డీఎస్సీ విషయానికి వచ్చే సరికి జగన్ సర్కార్ 6 వేలకు పైగా టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. వాటిని కలుపుకుని మొత్తం 16 వేల పోస్టులతో మెగా డీఎస్సీకి చంద్రబాబు సర్కార్ ముందుకు రావడం గుడ్డిలో మెల్ల అన్నట్టుగా వుంది. ఈ మాత్రమైనా నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఉద్యోగాలు దక్కితే అంతకంటే కావాల్సింది ఏముంటుంది?
పింఛన్ల పంపిణీ విషయంలో చంద్రబాబు సర్కార్‌కు వందకు 90 మార్కులు వేయొచ్చు. పింఛన్ల అరియర్స్‌ను దివ్యాంగులు, దీర్ఘకాలిక రోగులు, మరికొందరికి ఇవ్వలేదనే ఆరోపణలు, ఆవేదనలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వానికి ఈ విషయంలో మంచి పేరు వచ్చింది. 50 ఏళ్లు నిండిన బీసీలకు కూడా పింఛన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వారంతా ఎదురు చూస్తున్నారు.
తల్లికి వందనం నిబంధనలకు సంబంధించి ఏపీలో గత రెండు రోజులుగా తీవ్ర దుమారం రేపుతోంది. ప్రతి తల్లి ఖాతాలో రూ.15 వేలు వేస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై ప్రజలు, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామనే హామీతో గంపగుత్తగా ఓట్లు వేయించుకుని, అధికారంలోకి వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకోవడం ఏంటంటూ మండిపడుతున్నారు.
అలాగే ఇసుక ఉచితంగా అందిస్తామని చెప్పి, ఇప్పుడు టన్నుకు వెయ్యికి పైగా రేటు పెట్టడం ఏంటని విరుచుకుపడుతున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తైతే… ఓడిపోయిన వైసీపీ కార్యకర్తలు, నాయకులు, వారి కార్యాలయాలు, వ్యక్తిగత ఆస్తులపై సాగుతున్న దాడులు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చాయి. ఒకవైపు ప్రభుత్వం కొలువుదీరకుండానే, అధికారంలోకి వచ్చాం కదా అని యథేచ్ఛగా దాడులకు పాల్పడడంపై పౌర సమాజం నివ్వెరపోయింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదనే చర్చకు తెరలేచింది. ముఖ్యంగా నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని అందరూ చూస్తుండగా ధ్వంసం చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. గతంలో ప్రజావేదిక కూల్చివేతతో జగన్ పాలన ప్రారంభమైందని, చంద్రబాబు కూడా అదే రీతిలో పాలన మొదలు పెట్టారని, వైసీపీ గతే తమ పార్టీకి పడుతుందనే భయాందోళనను కొందరు టీడీపీ నేతలు బయట పెట్టారు.
ఇక అధికారులపై అధికార పార్టీ నేతల పెత్తనం ఆ వర్గాల్లో అసంతృప్తికి దారి తీస్తోంది. స్పీకర్‌గా బాధ్యతలు తీసుకోడానికి కొన్ని రోజుల ముందు అయ్యన్నపాత్రుడు మున్సిపల్ అధికారులపై, అలాగే మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రి రాంప్రసాద్‌రెడ్డి భార్య హర్షితారెడ్డి ఎస్ఐపై రుబాబు, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ప్రత్యర్థులకు చెందిన భవనాన్ని కూల్చేందుకు చేసిన దాష్టీకం ప్రభుత్వానికి ఎలాంటి పేరు తీసుకొచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇవన్నీ నెల రోజుల వ్యవధిలో సాగినవే.
చంద్రబాబు నెల రోజుల పాలన గురించి చెప్పాలంటే ఉగాది పచ్చడిలా వుంది. తీపి, చేదు, వగరు తదితర రుచులన్నీ బాబు పాలనలో ఉన్నాయి. ఇందులో తీపి కంటే చేదు, వగరే ఎక్కువపాళ్లు అన్న అభిప్రాయం పౌర సమాజం నుంచి వ్యక్తమవుతోంది.