బెజవాడలో దారుణం చోటుచేసుకుంది. ఓ డాక్టర్ తో పాటు అతడి తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారు. ఉన్నత చదువు చదివిన వ్యక్తి ఇలా ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ఆర్థిక కారణాలే కారణం అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
డాక్టర్ శ్రీనివాస్ ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్. అతడికి భార్య ఉష, కూతురు శైలజ, కొడుకు శ్రీహాన్ ఉన్నారు. తల్లి రమణమ్మతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాడు. ఈమధ్య ఓ హాస్పిటల్ స్థాపించాడు శ్రీనివాస్. దాని కోసం భారీగా ఖర్చు చేశాడు.
అయితే అనుకున్న స్థాయిలో హాస్పిటల్ నడవలేదు. దీంతో ఎంతో ఇష్టపడి, కష్టపడి స్థాపించిన హాస్పిటల్ ను అమ్ముకున్నాడు. అప్పట్నుంచి ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయాడని చుట్టుపక్కనవాళ్లు చెబుతున్నారు. ఇదే క్రమంలో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు కూడా భావిస్తున్నారు.
ఈరోజు ఉదయం పని మనిషి ఇంటి గేటు ఓపెన్ చేయగానే, వరండాలో శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకొని కనిపించాడు. వెంటనే ఆమె చుట్టుపక్కల వాళ్లకు, పోలీసులకు తెలిపింది. లోపలకు వెళ్లి చూసిన పోలీసులకు.. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కూడా మరణించినట్టు గుర్తించారు. వాళ్లను హత్య చేసిన అనంతరం శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని భావిస్తున్నారు.