ఈ వారం వీకెండ్, రేపట్నుంచే షురూ కానుంది. వచ్చేవన్నీ చిన్న సినిమాలే అయినప్పటికీ వేటికవే ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ముందుగా రేపటి సినిమాలు చూద్దాం.
మే డే కానుకగా 2 సినిమాలు రీ-రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఒకటి ప్రేమికుడు, రెండోది వకీల్ సాబ్. పవన్ కల్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా వకీల్ సాబ్ కు ఫ్యాన్స్ లో ప్రత్యేక స్థానం ఉంది. పైగా ఇది ఎన్నికల సీజన్. అందుకే టైమ్ చూసి సినిమాను రిలీజ్ చేస్తున్నట్టున్నారు. అయితే ఊహించిన స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు.
ఇక రీ-రిలీజ్ అవుతున్న మరో సినిమా ప్రేమికుడు. 30 ఏళ్ల కిందట రిలీజైన ఈ సినిమా ఇప్పుడు మరోసారి తెరపైకి వస్తోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వాళ్లంతా ఈ సినిమాను థియేటర్లలో చూడ్డానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అంతకుమించి ఇంకేం లేదు.
ఇక 3వ తేదీన రిలీజవుతున్న సినిమాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న మూవీ ఆ ఒక్కటి అడక్కు. సూపర్ హిట్ టైటిల్ ను రిపీట్ చేయడం, చాన్నాళ్ల తర్వాత అల్లరోడు ఓ కామెడీ సినిమా చేయడంతో ఈ మూవీపై అందరి దృష్టి పడింది. ప్రచారం కూడా గట్టిగా చేస్తున్నారు.
ఇక అల్లరి నరేష్ సినిమాకు పోటీగా బాక్, శబరి, ప్రసన్నవదనం సినిమాలొస్తున్నాయి. హారర్ థ్రిల్లర్ గా వస్తోంది బాక్ సినిమా. తమన్న, రాశిఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను స్వీయదర్శకత్వంలో సి.సుందర్ హీరోగా నటిస్తూ తెరకెక్కించాడు.
వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్ పోషించిన శబరి, సుహాస్ నటించిన ప్రసన్న వదనం సినిమాలు కూడా శుక్రవారమే థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ సినిమాలన్నీ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. అన్ని సినిమాలకూ సమాన అవకాశాలున్నాయి. ఏ సినిమా నిలబడుతుందో చూడాలి.