అదేంటో కాలం మరింది. యువత అభిరుచి కూడా మారిపోయింది. ఒకనాడు సిగరెట్ తాగితే మహా పాపం అనేవారు. మందు కొడితే పాడైపోయాడు అని కూడా లెక్కేసేవారు. కానీ ఇపుడు వాటిని మించిన భూతం ఒకటి తయారైంది. అదే డ్రగ్.. మాదక ద్రవ్యం. ఇది యువతను ఆవహించి చిత్తు చేస్తోంది.
కాస్మోపాలిటిన్ నగరాల్లో డ్రగ్స్ అన్నది ఒక భయంకరమైన అలవాటుగా మారిపోయింది. ఒక విధంగా యూత్ కేర్ లెస్ హ్యాబిట్ కి సింబల్ గా కూడా మారిపోయింది. విశాఖలో తరచూ డ్రగ్ రాకెట్స్ గుట్టు బయటపడుతోంది. అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి మరో చోటకు ఈ డ్రగ్స్ రవాణా సాగుతోంది.
ప్రత్యేకించి విశాఖ టూ గోవాకు బలమైన లింక్ ఒకటి ఏర్పడిపోయింది. గతంలో ఇది ఏమరుపాటుగానో మరో తెరచాటుగానో అనుకున్నా కూడా ఇపుడు మాత్రం అలవాటుగానే మారింది. డైరెక్ట్ గానే ట్రాన్స్ పోర్ట్ చకచకా సాగిపోతోంది. ఈ డ్రగ్స్ రవాణాను అడ్డుకునేందుకు పోలీస్ యంత్రాంగం ఎంత శ్రమిస్తున్నా మూలాలను మాత్రం పట్టుకోలేకపోతున్నారు.
అసలైన వారి గుట్టు మాత్రం రట్టు చేయలేకపోతున్నారు. లేటెస్ట్ గా విశాఖలో డ్రగ్స్ రాకెట్ గుట్టు బయటపెట్టారు. అయిదురుగు నిందితులను అరెస్ట్ చేశామని పోలీస్ ఉన్నతాధికారులు చెప్పారు. నిందితుల నుంచి డ్రగ్స్, ఐదు సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.
ఈ డ్రగ్స్ రవాణా కోసం ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూపులు, డార్క్ వెబ్ ద్వారా విక్రయం జరుపుతున్నారని పోలీసులు గుర్తించారు. క్రిప్టో కరెన్సీ, యూపీఐ ఆధారిత చెల్లింపుల సాయంతో డ్రగ్స్ విక్రయాలు సాగిస్తున్నారని విశాఖ నగర పోలీస్ కమిషనర్ చెప్పడం విశేషం. ముఠా గుట్టు రట్టు చేసే ప్రయత్నం సాగుతోందని చెప్పారు. ఇవన్నీ చూస్తూంటే డ్రగ్స్ కి విశాఖ ఒక ముఖ్య రవాణా కేంద్రంగా మారుతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.