ఆల్రెడీ ఏక్ నాథ్ షిండేను డమ్మీ చేసేశారనే పేరు వస్తోంది. కొత్త కేబినెట్ ఏర్పాటు విషయంలో కూడా దేవేంద్ర ఫడ్నవీసే ఢిల్లీకి వెళ్తారనే టాక్ ఉంది. తన కేబినెట్ లో ఎవరు ఉండాలో ఢిల్లీకి వెళ్లి నోట్ చేసుకునే వచ్చే అవకాశం కూడా ఏక్ నాథ్ కు ఇచ్చేలా లేరు కమలనాథులు. ఆ అవకాశాన్నీ కూడా బీజేపీ నేతకే ఇస్తారట. అయితే ఏక్ నాథ్ షిండేకు ఆరోగ్యం బాగోలేదని, అందుకే ఆయన స్థానంలో ఫడ్నవీస్ ఢిల్లీ వెళ్లి కేబినెట్ కూర్పు గురించి తెలుసుకుని వస్తారనేది మహారాష్ట్ర వార్తల సారాంశం.
అయితే ఇప్పటికే ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం ఏర్పడి ఐదు వారాలు గడిచిపోయాయి. కానీ, ఇప్పటి వరకూ కొత్త కేబినెట్ ఏర్పడలేదు. 14 మందితో తొలి దశ విస్తరణ అంటున్నారు కానీ, ఇప్పటి వరకూ ఆ వ్యవహారం పట్టాలెక్కడం లేదు.
ఇప్పటికే కాంగ్రెస్, ఎన్సీపీలు విమర్శలు మొదలుపెట్టాయి. 36 రోజులు అయిపోయాయి.. ఇంకెప్పుడు కేబినెట్ ను ఏర్పరచాలనుకుంటున్నారు? అంటూ ఆ పక్షాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. కానీ, కేబినెట్లో ఎవరికి చోటు కల్పిస్తే ఎలాంటి అసంతృప్త స్వరాలు వినిపిస్తాయో అనేది తర్జనభర్జనలకు కారణం అవుతున్నట్టుగా ఉంది.
మరి కేబినెట్ లేకుండా ఎన్నాళ్లు ఇలా పాలన కొనసాగిస్తారు? అనేది మాత్రం ఈ కొత్త ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అంశం. ఢిల్లీలో పరపతి ఉంది కాబట్టి, అర్జెంటుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేశారు. కానీ, కేబినెట్ వరకూ వచ్చే సరికి ఇంకా కూర్చలేకపోతున్నారు.
ఇక్కడే కాదు… కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి. రెండేళ్ల పాటు కేబినెట్ ను పునర్వ్యస్థీకరించే ప్రయత్నాలు చేసి చివరకు యడియూరప్ప పీఠం దిగిపోయారు. ప్రస్తుత కర్ణాటక సీఎం బొమ్మై కూడా ఎక్కదీ, దిగేదీ ఢిల్లీ ఫ్లైటే! ఇదీ కథ.