ఒక్కసారిగా ఇళ్లలో నుంచి జనం బయటికి పరుగులు తీశారు. బతుకు జీవుడా అంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తమను తాము కాపాడుకునేందుకు కాళ్లకు పనిపెట్టారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే… ఇటీవల తుపాను ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వర్షాలు కురిశాయి. ఇప్పుడిప్పుడే సూర్య భగవానుడు కనిపిస్తుండడంతో జనం ఇళ్లలో నుంచి పనుల కోసం బయటకు వస్తున్నారు.
తాజాగా ఆ జిల్లాలో భూకంపం సంభవించడంతో జనం బెంబేలెత్తారు. అయితే స్వల్ప భూకంపం కావడంతో హమ్మయ్యా… బతికి పోయాం అంటూ ఊపిరి పీల్చుకున్నారు. పలమనేరు, గంగవరం, కిలపట్ల, గంటవూరు, బండమీద జరావారిపల్లె, కురప్పల్లి, గాంధీనగర్, నలసానిపల్లె తదితర ప్రాంతాల్లో బుధవారం ఉదయం స్వల్పంగా భూమి కంపించింది.
ఇలా 15 నిమిషాల వ్యవధిలో మూడు సార్లు చొప్పున, పది సెకెండ్ల పాటు భూమి కంపించడంతో జనం భయాందోళనలతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఇళ్ల గోడలు బీటలు వారాయి. భూకంప సమయంలో భారీ శబ్దాలు రావడం, అలాగే ఇళ్లలోని వస్తువులు కిందపడిపోవడంతో ఏదో ప్రకృతి విపత్తు సంభవిస్తోందని ప్రజలు గ్రహించారు. భూకంపం తీవ్రత తెలియక, రక్షణ కోసం మైదాన ప్రాంతాల్లోకి ప్రజలు చేరుకునేందుకు పరుగులు పెట్టారు.
గతంలో కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భూకంపం సంభవించింది. అయితే గతంలో రాత్రివేళ ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పట్లో ఇళ్ల గోడలు ఎక్కువగా పగుళ్లుబారాయి. రాత్రంతా భయంతో జనం జాగారం చేశారు. అయితే ఈ దఫా ఆందోళన చెందాల్సినంత స్థాయిలో భూకంపం సంభవించలేదని అధికారులు చెబుతున్నారు.