విపక్షాలు మాట్లాడితే చాలు విశాఖలో శాంతి భద్రతలు పూర్తిగా లేకుండా పోయాయని విమర్శిస్తారు. విశాఖలో ఏదో జరిగిపోతోంది అని కూడ బయట ప్రపంచానికి కలరింగ్ ఇస్తారు. కానీ నిజానికి విశాఖ పీస్ ఫుల్ గా ఈ రోజుకీ ఉంది. ఈ మాటలు సమర్ధించుకోవడానికి వైసీపీ నేతలు చెప్పింది కాదు. విశాఖ క్రైమ్ డేటాను మొత్తం పరిశీలించి నేరాల రేట్ ని అంచనా వేసి పూర్తి సమీక్ష చేసిన అనంతరం రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి చెబుతున్న మాటలు.
విశాఖ పీస్ ఫుల్ గా ఉన్న బ్యూటిఫుల్ సిటీ. విశాఖలో నేరాలు పెరిగిపోతున్నాయంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. క్రైం రేట్ చాలా కంట్రోల్ లో ఉంది అని ఆయన అంటున్నారు. విశాఖలో ఆందోళకర పరిస్థితులు అసలు లేవని ఆయన పూర్తి స్పష్టత ఇచ్చారు. విశాఖలో హత్యాయత్నం కేసులతో పాటు అత్యాచార కేసులు కూడా బాగా తగ్గుముఖం పట్టాయని ఆయన వివరించారు.
ఎదుగుతున్న నగరంగా ఉన్నా కూడా విశాఖలో రోడ్డు ప్రమాదాలు పెద్దగా చోటు చేసుకోలేదని అంతా సవ్యంగా ఉందని, పూర్తి అదుపులో విశాఖలో పరిస్థితి ఉందని డీజీపీ వెల్లడించడం విశేషం. విశాఖలో నేరాలను పూర్తిగా నియంత్రించడానికి ప్రత్యేక ప్రణాళిలతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.
విశాఖ ఏజెన్సీలో అక్రమ గంజాయి మీద ఉక్కు పాదం మోపామని, ఇప్పటిదాకా 1,599 కేసులు నమోదు చేయడం అంటే ఫోకస్ ఎంతలా పెట్టామన్నది అర్ధం చేసుకోవాలని ఆయన కోరారు. విశాఖ ఏజెన్సీలో మావోల యాక్టివిటీని కూడా బాగా తగ్గించడంలో పోలీసులు కీలక మైన పాత్ర పోషించారని ఆయన పేర్కొంటున్నారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలలో నిరంతరం కూంబింగ్ జరుగుతూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.