‘ఛీఛీ’ అనిపిస్తున్న ఈనాడు ఏడుపు!

రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడానికి, వాటిని పొందడంలో ప్రజలకు సహాయకులుగా ఉండడానికి, వాటి అమలులో క్రియాశీలంగా ఉండడానికి ఏర్పాటైనదే వాలంటీర్ల వ్యవస్థ. ఈ వాలంటీర్లు ప్రభుత్వానికి…

రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడానికి, వాటిని పొందడంలో ప్రజలకు సహాయకులుగా ఉండడానికి, వాటి అమలులో క్రియాశీలంగా ఉండడానికి ఏర్పాటైనదే వాలంటీర్ల వ్యవస్థ. ఈ వాలంటీర్లు ప్రభుత్వానికి సేవలందిస్తూ గౌరవవేతనం పుచ్చుకుంటారు. 

ప్రజలతో ప్రభుత్వంతో నిత్యం అనుసంధానమై ఉంటారు. వీరికి ప్రభుత్వ కార్యకలాపాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుస్తూ ఉండడం కూడా ఎంతో అవసరం. వారి ప్రాథమిక బాధ్యతను నిర్వర్తించడానికి తప్పనిసరి. అందుకోసం జరిగిన ఏర్పాటును కూడా వ్యతిరేకిస్తూ.. అక్కడికేదో రాష్ట్రప్రయోజనాలకు విఘాతం కలుగుతున్నట్టుగా ఈనాడు ఏడుస్తున్న ఏడుపు ప్రజలకు చీదర పుట్టిస్తోంది. 

తాము ప్రజల పక్షం ఉంటామని ఈనాడు చెప్పుకుంటూ ఉంటుంది. ప్రజలకోసం పాటుపడుతుంటామని చెబుతుంటుంది. ‘ప్రజలకోసం’ అనే ముసుగులో వారి సమస్యల గురించి ఏనాడైనా ఒక చిన్న వార్త ప్రచురించి చేతులు దులుపుకుంటారేమో గానీ.. తమ  సొంత వ్యాపార ప్రయోజనాలకు దెబ్బ పడుతుందనే భయం పుట్టేసరికి.. ఒకవైపు హైకోర్టు లోను, మరొకవైపు సుప్రీం కోర్టులోనూ దావాలు వేసి పోరాడుతున్న తీరు అసహ్యకరంగా ఉంది. 

వాలంటీర్లు ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు, పథకాలు, కార్యక్రమాల గురించి సదవగాహన కలిగి ఉండడానికి, బాగా ప్రజాదరణ ఉన్న ఏదైనా పత్రికను కొనుగోలు చేసుకోవడానికి వారికి నెలకు రూ.200 అలవెన్సును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో తప్పేం ఉందో ఎవ్వరికీ అర్థం కాని సంగతి. న్యూస్ పేపర్ కొనుగోలుకు ప్రభుత్వంలో అనేక స్థాయుల్లోని అధికారులకు ప్రత్యేక అలవెన్సులు ఉంటాయి. వాలంటీర్లు క్షేత్రస్థాయిలో కీలకం గనుక.. వారికి కూడా అలవెన్సు ఇచ్చారు. 

అయితే ప్రభుత్వానికి అనుకూల వార్తలు సాక్షి దినపత్రికలో మాత్రమే వస్తుంటాయని, వాలంటీర్లు అందరూ సాక్షినే కొనుగోలు చేస్తారని ఈనాడుకు భయం పట్టుకుంది. తాము రాసే అబద్ధాలు కాకుండా ప్రజలకు నిజం తెలుస్తుందనేది మాత్రమే వారి భయం కాదు. 

సాక్షి పత్రిక సర్కులేషన్ హఠాత్తుగా సుమారు 1.5 లక్షల కాపీలు పెరిగిపోతుందని భయం. అగ్రదినపత్రికగా అబద్ధపు డప్పు కొట్టుకుంటున్న తమ ఈనాడు సర్కులేషన్ సామ్రాజ్యం కుప్పకూలుతుందని భయం. సాక్షి సర్కులేషన్ పెరిగిపోతే.. తమ ఈనాడు యాడ్ రెవెన్యూ తగ్గిపోతుందని భయం. 

ఇన్ని స్వార్థ ప్రయోజనాలు, సంకుచిత భయాల మద్య ఈనాడు ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో కేసు వేసింది. 2020 నాటి మరో పిల్ తో కలిపి ఈ కేసు వాదనలు వింటాం అని హైకోర్టు పేర్కొనగా, ఈనాడు సహించలేకపోయింది. ఈలోగా సుప్రీం కోర్టుకు వెళ్లింది. దీనిని ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తాం అని సుప్రీం పేర్కొనగా.. వద్దు వద్దని గోల చేస్తోంది. 

ప్రజలు, నిజాలు, రాష్ట్రం అంటూ సుద్దులు చెప్పే ఈనాడు తమ వ్యాపార ప్రయోజనాల కోసం ఎలాంటి నిబంధనల అతిక్రమణ లేని ఒక ప్రభుత్వ నిర్ణయం గురించి న్యాయపోరాటం చేయడం చాలా చీప్ గా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.