టాలీవుడ్ లో అన్ని విజయాలూ ఒకలా వుండవు..అన్ని మరణాలు ఒకలా వుండవు. దేని లెక్కలు దానికి వుంటాయి. కొన్నింటికి లక్షలు ఖర్చుతో ముందుకు వస్తారు. కొన్నింటికి అస్సలు అటు కన్నే వేయరు.
ఎస్పీబీ, కైకాల సత్యనారాయణ, జమున, కె. విశ్వనాధ్ లాంటి సీనియర్లు చనిపోతే ఓ సంస్మరణ సభ ను నిర్వహించే ఆలోచన లేదు. కే. విశ్వనాధ్ కోసం దర్శకుల సంఘం సమావేశం ఏర్పాటు చేయాలంటే పీపుల్స్ మీడియా, సుబ్బరామిరెడ్డి లాంటి వాళ్లు స్పాన్సర్ చేయాల్సి వచ్చింది. అదీ పరిస్థితి.
కానీ అదే ఆస్కార్ అవార్డు విజేత ఆర్ఆర్ఆర్ కు సన్మానం చేయమంటే మాత్రం ఛాంబర్ కు ఉత్సాహం వచ్చింది. పాతిక లక్షలు ఖర్చు చేసారని తెలుస్తోంది. పైగా ఈ ఈవెంట్ ను నిర్వహించడానికి ముంబాయి నుంచి ఈవెంట్ ఏజెన్సీని రప్పించారు.
ఈ బాధ్యతలు అన్నీ హీరో రానా తన భుజాల మీద వేసుకున్నారని తెలుస్తోంది. తప్పు లేదు. ఆస్కార్ విజేతలు అంటే మామూలు విషయం కాదు. ఆ మాత్రం చేయాల్సిందే. అందుకు పాతిక లక్షలు ఖర్చు చేయడమూ తప్పు కాదు.
కానీ దేనికైనా ఒకటే పద్దతి వుండాలి. శుభానికైనా..సంస్మరణకైనా. కే విశ్వనాధ్, ఎస్పీబీ, జమున, కైకాలా లాంటి వారు మరణించినపుడు కనీసం పాతిక వేలు అయినా ఖర్చు చేసి ఓ సంస్మరణ సభ పెట్టి వుంటే ఇప్పుడు ఈ వార్త రాసే అవకాశం, అవసరం రెండూ వుండవు.
విజయాలను ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకోవడం ఎంత వరకు అవసరమో, మన మధ్య నుంచి కనుమరుగై, మంచి సినిమాలను మనకు వదిలేసి వెళ్లిన వాళ్లను సంస్మరించుకోవడం అంతే అవసరం. అంతే తప్ప బతికున్నవాళ్లతో అవసరాలు వుంటాయి. పోయిన వాళ్లతో ఏమొచ్చె అనుకోకూడదు.