విశాఖ ఎపుడూ ఎవర్ గ్రీన్ హీరోయినే కదా. పదహారేళ్ళ పరువాలతో కళకళలాడే అందగత్తె కదా అని అనుకోవచ్చు. సహజసిద్ధంగా ఉన్న అందానికి నగిషీలు ముస్తాబులు చేయడం కూడా జరుగుతూ ఉండాలి. మామూలు అందమే ఆహా అనిపించవచ్చు. కాస్తా సొగసుని దిద్దితే ఓహో అనిపించవచ్చు. వచ్చేది అతిధులు. వారు విదేశాల నుంచి వస్తున్నారు. ఎన్నో దేశాల నుంచి విశాఖకు వచ్చి వాలుతారు.
ఇరవైకి పైగా దేశాల నుంచి వేలాదిగా వీవీఐపీలు విశాఖకు రాబోతున్నారు. వారు మూడు రోజుల పాటు విశాఖలో విడిది చేయబోతున్నారు. విశాఖ అందాలను ప్రత్యక్షంగా వీక్షించబోతున్నారు. అందుకోసం విశాఖ సుందరి తనను తను సరికొత్తగా కొత్త పెళ్ళికూతురుగా అలంకరించుకుంటోంది.
విశాఖలో మార్చి 28, 29 తేదేలలో జరిగే జీ 20 సదస్సుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. విదేశీ అతిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు మంత్రులు, ఉన్నతాధికారులు రాయబారులు ఇలా జీ 20 సన్నాహక సదస్సుకు విశాఖకు తరలివస్తున్న వారి సంఖ్య పెద్దగానే ఉంది.
వారందరి కోసం విశాఖ మరింత అందంగా తయారవుతోంది. విశాఖ సాగరతీరం అంతా కొత్త జిలుగులు అద్దుకుంటోంది. విశాఖ టూ భీమిలీ దాకా టూరిజం స్పాట్స్ నూతన శోభను సంతరించుకుంటున్నాయి. విశాఖలో సుందరీకరణ పనులు ఇపుడు చురుకుగా సాగుతున్నాయి. జీవీఎంసీ ఈ విషయంలో చురుకుగా పనిచేస్తోంది.
విశాఖ రోడ్లతో పాటు కీలక ప్రదేశాలు అన్నీ కూడా చూడముచ్చటగా మారనున్నాయి. అథిధులు సదస్సుకు హాజరైన తరువాత విశాఖ అందాలను చూసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ ప్రత్యేకత సంస్కృతి వంటివి అతిధులకు తెలియచేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
పచ్చని చెట్లతో పాటు రహదారులకు ఇరువైపులా విశాఖ గొప్పతనం గురించి చాటి చెప్పే వర్ణ చిత్రాలతో పాటు విశాఖ విఖ్యాతిని మరింతగా గుర్తుకు తెచ్చే వివిధ రకాల ఆకృతులను అమరచడం ద్వారా సిటీ ఆఫ్ డెసిటీ గురించి జీ 20 సదస్సుకు వచ్చే వారు జీవితాంతం గుర్తుంచుకునే విధంగా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖను తిలకించి పులకించాలన్నదే అధికారుల ఆలోచన.