ChatGPT Vs Google… యాడ్స్ ప్ర‌పంచం అత‌లాకుత‌లం?

త‌న‌పై యూజ‌ర్లు ఆధార‌ప‌డుతున్న కొద్దీ ఆదాయాన్ని విప‌రీతంగా పెంచుకుంది గూగుల్! ఒక‌వైపు కంటెంట్ క్రియేట‌ర్ల‌కు యాడ్ రెవెన్యూని కొద్ది మేర షేర్ చేస్తూనే.. త‌ను ఆదాయాన్ని ఊహ‌కు అంద‌నంత స్థాయిలో పెంచుకుంది. ఎంత‌లా అంటే..…

త‌న‌పై యూజ‌ర్లు ఆధార‌ప‌డుతున్న కొద్దీ ఆదాయాన్ని విప‌రీతంగా పెంచుకుంది గూగుల్! ఒక‌వైపు కంటెంట్ క్రియేట‌ర్ల‌కు యాడ్ రెవెన్యూని కొద్ది మేర షేర్ చేస్తూనే.. త‌ను ఆదాయాన్ని ఊహ‌కు అంద‌నంత స్థాయిలో పెంచుకుంది. ఎంత‌లా అంటే.. వేరే యాడ్ మార్కెట్ ల మార్గాల‌న్నీ మూసుకుపోయి, ఆన్ లైన్ యాడ్స్ మాత్ర‌మే మిగిలాయి అనిపించేంత స్థాయిలో ప‌దేళ్ల‌లోనే ప‌రిస్థితి మారిపోయింది! ప్రింట్ యాడ్ లు, రోడ్ సైడ్ బోర్డింగులు గ‌ల్లంత‌య్యాయి! బ‌స్సుల్లో, కార్ల‌లో ప్ర‌యాణించే వాళ్లు ఫోన్ల‌కు అతుక్కుపోతున్నారు. అలాంట‌ప్పుడు రోడ్ సైడ్ యాడ్ హోర్డింగులు పెట్ట‌డంలో అర్థం ఏముంది? ఇక ప్రింట్ ఎడిష‌న్ల అడ్ర‌స్ లేకుండా పోతున్నాయి. పెద్ద పెద్ద మీడియా హౌస్ లే ప్రింట్ ను త‌గ్గించేస్తున్నాయి. ప్ర‌జ‌లు డిజిట‌ల్ కు అల‌వాటు ప‌డ‌టం ఒక కార‌ణం అయితే, యాడ్ ఇచ్చే వాళ్లంతా డిజిట‌ల్ వైపే చూస్తూ ఉండ‌టం ఇందుకు మ‌రో కీల‌క కార‌ణం!

ఇలా డిజిట‌లైజ్ అయిన యాడ్ మార్కెట్ తో ప్ర‌ధాన ఆదాయం పొందుతున్న‌ది గూగుల్! యాడ్ సెన్స్ అకౌంట్ కోసం కంటెంట్ క్రియేట‌ర్లు త‌పించేపోయేలా వారిని త‌న వైపు తిప్పుకుంది! త‌న బ్లాగులు, త‌న యూట్యూబ్, తన యాడ్ సెన్స్.. ఇలా అంతా త‌న చుట్టూరానే గూగుల్ తిప్పుకుంటోంది! కంటెంట్ క్రియేట‌ర్లు, వెబ్ సైట్ల‌ను న‌డిపే వాళ్లకూ గూగుల్ ప‌ప్పు బెల్లాలు పంచుతోంది. మెజారిటీ రెవెన్యూని త‌న అకౌంట్లోకి జ‌మ చేసుకుంటూ వ‌స్తోంది. అంతేనా.. మ‌రోవైపు స్పాన్స‌ర్డ్ వ్య‌వ‌హారాలు!

త‌న సెర్చింజ‌న్ లో ముందు చూపించాలంటే ఒక రేటు, ఆ రేటు క‌ట్ట‌క‌పోతే స్పాన్స‌ర్డ్ అంటూ వేరే వెబ్ సైట్ల‌ను ప్ర‌మోట్ చేస్తుంది! ఇలా గూగుల్ యాడ్ మార్కెట్ చిన్న చిన్న దేశాల జీడీపీని దాటిపోయింది! ఇంట‌ర్నెట్ ట్రెండ్ ను సెట్ చేయ‌డం మ‌రో అంశం. ఏతావాతా జీవితాలు జీమెయిల్, గూగుల్ నెట్ వ‌ర్క్ ల‌లో చిక్కుకుపోయాయి. 

ఇప్పుడ‌ప్పుడే స‌వాళ్లు ఉండ‌వ‌నుకున్న గూగుల్ కు చాట్ జీపీటీ తో స‌రికొత్త‌, ఊహించ‌ని స్థాయి స‌వాల్ ఎదుర‌వుతోంది. వాస్త‌వానికి ఈ చాట్ జీపీటీని గూగులే త‌యారు చేసి ఉంటే అది త‌న‌కు మ‌రో మార్కెటింగ్ మార్గం అయ్యేది! ఎందుకో గూగుల్ ఈ ప‌ని చేయ‌లేక‌పోయింది!

ఇప్ప‌టి వ‌ర‌కూ గూగుల్ లో ఏదైనా శోధిస్తే.. అందుకు సంబ‌ధించిన రిజ‌ల్ట్స్ వ‌స్తున్నాయి. చాట్ జీపీటీ మాత్రం అడిగిన దానికి దాదాపు సూటిగా సుత్తి లేకుండా స‌మాధానం ఇస్తోంది! అయితే ఈ స‌మాచారంలో కొంత తేడాలుంటున్నాయి. త‌ప్పుడు స‌మాచారానికి లోటు లేదు. అయితే చాట్ జీపీటీ కి మిలియ‌న్ల కొద్దీ యూజ‌ర్లు త‌యార‌వుతున్నారు అతి త‌క్కువ స‌మ‌యంలోనే!

మ‌రి ఇక నుంచి దేన్నైనా గూగుల్ చేయ‌మ‌నే వారు సులువుగా! ఇక నుంచి చాట్ జీపీటీ జ‌ర‌గ‌వ‌చ్చు! గూగుల్ లోకి వెళ్లి వ‌చ్చిన సెర్చి రిజ‌ల్ట్స్ లో తార్కికంగా, హేతుబ‌ద్ధంగా చూసుకుని కొత్త విండో ఓపెన్ చేసుకోవ‌డం కంటే.. చాట్ జీపీటీతో ఇన్ స్టంట్ స‌మాధాన‌మే జ‌నాల‌కు న‌చ్చ‌వ‌చ్చు! స్పూన్ ఫీడింగ్ కు జనాలు విప‌రీతంగా అల‌వాటు ప‌డ‌వ‌చ్చు! 

అయితే చాట్ జీపీటీలో ఇంకా మెరుగ‌వ్వాల్సిన స‌మాచారం చాలానే ఉంది. అది సరిద్దుకుంటే మార్చుకోగ‌ల అంశ‌మే కావొచ్చు! ఇప్ప‌టి వ‌ర‌కూ చాట్ జీపీటీ ప‌నిచేస్తున్న‌ది 2021 నాటి స‌మాచారం ఆధారంగానే. ఇవ‌న్నీ అప్ గ్రేడ్ కావొచ్చు.

ఇదంతా వేగంగా జ‌రిగితే.. గూగుల్ యాడ్ మార్కెట్ అత‌లాకుత‌లం అయ్యే అవ‌కాశాలు లేక‌పోలేదు. ఈ యాడ్ మార్కెట్ ను చాట్ జీపీటీ కాప్చ‌ర్ చేయొచ్చు!

అయితే ఎటొచ్చీ ఇంట‌ర్నెట్ కంటెంట్ క్రియేట‌ర్లను యాడ్ సెన్స్ తో అనుసంధానం చేస్తూ గూగుల్ డ‌బ్బులు ఇస్తోంది. చాట్ జీపీటీ ఇలాంటి అవకాశం ఇస్తుందా? వాస్త‌వానికి చాట్ జీపీటీ ఇచ్చే స‌మాచారాన్ని నిజం అని, ఒరిజిన‌ల్ అని ఎవ్వ‌రూ ధ్రువీక‌రించ‌డం లేదు ఇప్ప‌టి వ‌ర‌కూ! ఇది ప్లేజ‌రిజం కిందే వ‌స్తుంది. ఎంత ఏఐ అని చెబుతున్నా.. చాట్ జీపీటీ ఇచ్చే స‌మాచారం అంతా కీవ‌ర్డ్స్ ఆధారంగా సెర్చ్ చేసి ఇచ్చేదే! ఇది ప్లేజ‌రిజ‌మే అవుతుంది. క్రైమ్ కూడా అవుతుంది! త‌మ సైట్ల‌ను చాట్ జీపీటీ చ‌దివేయ‌కుండా, ఈ స‌మాచారాన్ని త‌న‌దిగా మ‌రో చోట ప్ర‌జెంట్ చేయ‌కుండా.. టెక్నాల‌జీ డెవ‌ల‌ప్ అవుతుందా? అక్ష‌య‌పాత్ర‌లా ఏ స‌మాచారాన్ని అయినా సొంతంగా ఇచ్చేస్తూ చాట్ జీపీటీ త‌న ప్ర‌స్థానాన్ని ఎంత వ‌ర‌కూ తీసుకెళ్లుంది? ఇదంతా ప్ర‌స్తుతానికి ఇంకా పూర్తి స్థాయిలో స‌మాధానాలు లేని ప్ర‌శ్న‌లే! 

జీవ‌న్