ప్రశాంతంగా ఉన్న విశాఖ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బీచ్ లో అర్థనగ్నంగా ఒక శవం కనిపించింది. సగం శరీరం ఇసుకలో కూరుకుపోగా, మిగతా సగం శరీరభాగం అర్థనగ్నంగా కనిపించి అందర్నీ భయభ్రాంతులకు గురిచేసింది. అటుగా మార్నింగ్ వాక్ కు వెళ్లిన వాళ్లు.. ఆ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.
ఇంతకీ ఎవరది?
ఆమె పేరు శ్వేత. గాజువాక సమీపంలో ఉన్న పెద గంట్యాడలో అత్తామామలతో కలిసి ఉంటోంది. దాదాపు ఏడాదిన్నర కిందట సాఫ్ట్ వేర్ ఉద్యోగి మణికంఠతో ఆమెకు వివాహం అయింది. శ్వేత తల్లి విశాఖ రైల్వే ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూ, అదే నగరంలో ఉంటోంది.
అయితే కొన్నాళ్లుగా అత్తామామలతో శ్వేతకు అభిప్రాయబేధాలు తలెత్తాయి. వర్క్ ఫ్రం హోం మోడల్ లో ఇంట్లోంచే పనిచేస్తూ వస్తున్న మణికంఠ కుటుంబ గొడవల్ని సర్దిచెబుతూ వచ్చాడు. అయితే కొన్ని రోజుల కిందట మణికంఠ హైదరాబాద్ వచ్చాడు. ఆఫీస్ కు వచ్చి పనిచేయాలని చెప్పడంతో వైజాగ్ నుంచి హైదరాబాద్ కు మారాడు.
ఈ క్రమంలో అత్తామామలతో శ్వేతకు మరింత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని చెబుతున్నారు. ఇదే క్రమంలో నిన్న భర్త మణికంఠతో మాట్లాడింది శ్వేత. ఇద్దరి మధ్య కాస్త వాగ్వాదం జరిగింది. ఆ వెంటనే శ్వేత తన మొబైల్ కట్ చేసింది. ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయింది.
ఇంట్లోంచి బయటకు వెళ్లిన శ్వేత, తన తల్లి దగ్గరకు వెళ్లి ఉంటుందని అత్తమామ భావించారు. కానీ రాత్రి గడిచినా ఆమె ఇంటికి చేరుకోలేదు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేలోపే, బీచ్ లో శవమై తేలింది శ్వేత.
చనిపోయే ముందు భర్తకు లేఖ..
బాధాకరమైన విషయం ఏంటంటే.. చనిపోయే సమయానికి శ్వేత 5 నెలల గర్భవతి. తను ఆత్మహత్య చేసుకోవడంతో పాటు, కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపుకుంది శ్వేత. చనిపోయే ముందు భర్తకు ఓ ఉత్తరం కూడా రాసిపెట్టింది. “నాకు ఎప్పుడో తెలుసు నేను లేకుండా నువ్వు ఉండగలవని. నీకు అసలు ఏమాత్రం పరక్ పడదని. ఎనీ వే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ న్యూ లైఫ్. చాలా మాట్లాడాలని ఉన్నా కూడా ఏం మాట్లాడను. బికాజ్ నువ్వు బయటకు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యూ నో ఎవ్రీ థింగ్, జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్.” అంటూ లెటర్ రాసి వెళ్లిపోయింది శ్వేత.
మృతదేహం చుట్టూ ఎన్నో అనుమానాలు..
శ్వేతది కేవలం ఆత్మహత్యయేనా అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు విశాఖ పోలీసులు. ఎందుకంటే, మృతదేహాన్ని గుర్తించే సమయంలో ఆమె కేవలం లోదుస్తులతో మాత్రమే ఉంది. పైగా సగం శరీరం ఇసుకలో కూరుకుపోయి ఉంది. ఎందుకిలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేవని మాత్రం స్పష్టం చేశారు.
మరోవైపు శ్వేత రాసిన సూసైడ్ లెటర్ ను కూడా విశ్లేషిస్తున్నారు. “చాలా మాట్లాడాలని ఉన్నా మాట్లాడను”, “బయటకు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీకు అన్నీ తెలుసు” అంటూ లెటర్ లో శ్వేత రాయడం అనుమానాలకు తావిస్తోంది.
అటు శ్వేత భర్త మణికంఠ మాత్రం తను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదంటున్నాడు. తామిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్న మాట వాస్తవమేనని, గతంలో 2సార్లు తమపై అలిగి పుట్టింటికి వెళ్లి, తిరిగొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపాడు మణికంఠ. అయితే అవన్నీ ప్రతి ఇంట్లో ఉండే చిన్న గొడవలని, ఆమాత్రం దానికే శ్వేత ఇంత అఘాయిత్యానికి పాల్పడుతుందని ఊహించలేదని అంటున్నాడు. త్వరలోనే శ్వేతను హైదరాబాద్ కు తీసుకెళ్లాలని కూడా అనుకున్నానని తెలిపాడు.