తస్మాత్ జాగ్రత్త! ఎగ్జిట్ పోల్స్ లో అతిపెద్ద కుట్ర!!

ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం జూన్ 1వ తేదీ సాయంత్రం పోలింగ్ ముగిసే వరకు దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా, ఎలాంటి సర్వే ఫలితాలు గానీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు గానీ వెల్లడించడానికి వీల్లేదు. పోలింగ్…

ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం జూన్ 1వ తేదీ సాయంత్రం పోలింగ్ ముగిసే వరకు దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా, ఎలాంటి సర్వే ఫలితాలు గానీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు గానీ వెల్లడించడానికి వీల్లేదు. పోలింగ్ పూర్తిగా ముగిసిన తర్వాత మాత్రమే ఎవ్వరైనా అంచనాలను బయటపెట్టాలి. లేకపోతే అది పనిషబుల్ క్రైమ్ అవుతుంది. అందుకే శాస్త్రీయంగా సర్వేలను గాని, ఎగ్జిట్ పోల్స్ లు గాని నిర్వహించే ఏ సంస్థలు కూడా- వాటితో కలిసి పనిచేసే మీడియా సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడం లేదు.

అయినా సరే సోషల్ మీడియా ప్రపంచంలో విస్తృతంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తున్నాయి. చాలా పక్కాగా, ఒక సంస్థ శాస్త్రీయమైన పద్ధతిలో నిర్వహిస్తే ఎలాంటి నివేదికను తయారు చేస్తుందో అదే తరహాలో ఎగ్జిట్ పోల్స్ రూపొందుతున్నాయి. గణాంక వివరాలు మాత్రమే కాకుండా.. గ్రాఫ్ లు ఇతరత్రా అదనపు హంగులను కూడా జోడించి మరీ ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలను తయారు చేస్తున్నారు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎన్నికల సంఘం వీటి మీద చర్యలు తీసుకోకుండా ఉంటుందా? ఇలాంటి అనుమానాలు కలగడం సహజం!

నిజానికి శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయన్నట్లుగా- ఎన్నికల సంఘం వారి శిక్షల నుంచి తప్పించుకోవడం వీరికి చాలా సులువు. ఒకవేళ ఒక సంస్థ పేరుతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వస్తే వారిని సంజాయిషీ చెప్పాల్సిందిగా ఈసీ కోరితే.. ‘మేం చేసింది నిజమే కానీ మా ఆఫీసులో మాకు తెలియకుండా ఆ వివరాలు బయటకు లీక్ అయ్యాయి’ అని సింపుల్ గా చెప్పేసి వారు తప్పించుకోగలరు.

ఊరూపేరూ లేని ఒక కొత్త సంస్థ పేరు పెట్టి ఎక్కడా కనిపించని ఒక చిరునామాను దానికి జోడించి ఈమెయిల్ మాత్రం పని చేసేదే ఇచ్చి ఆ ముసుగులో ఎగ్జిట్ పోల్స్ రూపొందించి ప్రజల మీదకి విడిచిపెట్టే ఒక ఫ్యాబ్రికేటెడ్ వ్యవహారం కూడా జరుగుతూ ఉండవచ్చు.

అయితే ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమిటంటే- జూన్ 1వ తేదీకి ముందుగా ఇప్పుడు విడుదల అవుతున్న ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కేవలం మాయ! ప్రజలను మభ్య పెడితే పర్వాలేదు. ఏ పార్టీ గెలుస్తుందో అంచనాలు చెబుతూ వారి వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఆనందాన్ని దుఃఖాన్ని ప్రసాదించి ఊరుకుంటే పర్వాలేదు. కానీ ప్రజలను నిట్టనిలువునా ముంచేసే నిలువు దోపిడీ చేసే కుట్రబుద్ధితోనే ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ తయారవుతున్నాయి.

బెట్టింగ్ వేసుకునే బెట్టింగ్ రాయుళ్ల కోసం మాత్రమే ఈ ఎగ్జిట్ పోల్స్ తయారవుతున్నట్లుగా మనం గుర్తించాలి. దారుణం ఎలా ఉంటున్నదంటే ఆయా పార్టీలే ఇలాంటి నకిలీ ఎగ్జిట్ పోల్స్ నివేదికలను చాలా పకడ్బందీగా తయారు చేయిస్తున్నాయి. తమ పార్టీ గెలుస్తుంది అని చెబుతూ అందులో నివేదికలు ఉంటాయి. వాటిని విడుదల చేయడం ద్వారా ప్రజలను బెట్టింగ్ కు ప్రోత్సహిస్తారు. ఆ బెట్టింగ్ లో కూడా తమ వారే జూదమాడుతూ బెట్టింగ్ పెట్టిన వారి డబ్బులు కాజేసే కుట్ర ఆలోచనలతో ఇదంతా చేస్తున్నారు.

అసలు ఎన్నికలవేళ బెట్టింగ్ కు వెళ్లడమే ఆత్మహత్యతో సమానమైన పని. ప్రజల నాడి ఎటువుంటుందో స్పష్టంగా ఎవరికీ అర్థం కాని పరిస్థితుల్లో బెట్టింగ్ వేయడం మంచి పద్ధతి కాదు. అయితే రాజకీయ పార్టీలు విలువలు లేని పద్ధతిలో తామే ఎగ్జిట్ పోల్స్ వేదికలను తయారు చేయించడం ప్రజలను వాటికి అనుగుణంగా రెచ్చగొట్టి బెట్టింగ్ కు పాల్పడేలా చేయడం, ఆ బెట్టింగ్ డబ్బులు దోచుకునే కుట్ర చేయడం సాగిస్తున్నాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండడం అవసరం!!