జగన్, చంద్రబాబు తదితరులపై ఐపీసీ 107 కేసు పెట్టాలి

ఈ ఎన్నికల్లో ఒక చిత్రమైన సంగతి స్పష్టంగా కనిపించింది. ‘‘మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఓట్లు కొనడానికి డబ్బులు ఇచ్చారు.. మాకు మాత్రం డబ్బులు ఇవ్వలేదు.. ఎందుకివ్వరు?’’ అని నాయకుల్ని నిలదీయడం ఆ చిత్రం! ప్రజలంతా…

ఈ ఎన్నికల్లో ఒక చిత్రమైన సంగతి స్పష్టంగా కనిపించింది. ‘‘మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఓట్లు కొనడానికి డబ్బులు ఇచ్చారు.. మాకు మాత్రం డబ్బులు ఇవ్వలేదు.. ఎందుకివ్వరు?’’ అని నాయకుల్ని నిలదీయడం ఆ చిత్రం! ప్రజలంతా గుంపుగా దండెత్తి.. అభ్యర్థుల ఇళ్లమీదికి, వారి కార్యాలయాల మీదికి ఎగబడడం పోలింగ్ కు ముందురోజు పరిణామాల్లో మనం గమనించాం. ఇలా ప్రజలు తమ ఓట్లకు డబ్బులు ఇవ్వడం లేదంటూ అడగడం, మీడియా వారెవరైనా సంప్రదిస్తే వారితో గొల్లుమనడం మనం గతంలో కూడా కొన్ని సందర్భాల్లో చూశాం.

కానీ ఏకంగా అభ్యర్థుల ఇళ్ల మీదకు దండుగా వెళ్లిపోవడం, వారిని నిలదీయడం, కాసేపైతే దాడికి తెగబడతారేమో అనిపించేంతగా రెచ్చిపోవడం.. పోలీసుల్ని పిలిపించి సర్దిచెప్పి పంపాల్సినంతగా వ్యవహారాలు ముదరడం ఈసారి మాత్రమే కనిపించాయి. ఎందుకిలా జరిగింది? ప్రజలు తమ ఓటుకు డబ్బు తీసుకోవడం అనేది ఒక ‘హక్కు’గా భావిస్తున్నారు! ప్రజాస్వామ్యానికి సంబంధించినంత వరకు చాలా ప్రమాదకరమైన పరిణామం ఇది.

మిత్రుల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. ఓట్లకు డబ్బు పంచడం అనేది కూడా ఒక చాటుమాటు వ్యవహారం లాగా సాగలేదు ఈ ఎన్నికల్లో! ప్రత్యర్తులు డబ్బు పంచుతున్నారని పోలీసులకు ఫోను చేయడం వంటి ఘటనలు అతి తక్కువగా మాత్రమే వెలుగులోకి వచ్చాయి. పోలీసులు కూడా డబ్బు పంచుతుండగా పార్టీల వారిని పట్టుకున్న వార్తలు కూడా చాలా తక్కువే. అలాంటి కేసుల్లో అతి తక్కువ మొత్తాలు మాత్రమే పట్టుబడతాయి అనేది అందుకు ఒక కారణం కావొచ్చు. డబ్బు తరలిస్తుండగా భారీ మొత్తాలు పట్టుకున్న వార్తలు చాలా వచ్చాయి.

ఇక్కడ ఇంకో సంగతి కూడా మనం గమనించాలి. మా గ్రామానికి రోడ్డు లేదు, ఉన్న రోడ్డు అత్యంత అధ్వానంగా తయారైంది, గోతుల్లో ప్రయాణించలేకపోతున్నాం అని గానీ, మా కాలనీలో తాగునీటి సదుపాయమో మరొకటో లేదు అని గానీ.. ఆ కాలనీ వాసులంతా కట్టగట్టుకుని ఎమ్మెల్యే వద్దకో, సంబంధిత అధికారి వద్దకో వెళ్లిన దాఖలాలు మనకు చాలా తక్కువ. అలాంటి పనులు జరగడం లేదని కాదు. కానీ ఎవరో ఒకరు అలాంటి వినతిపత్రం తయారుచేసుకుని ఎమ్మెల్యే దగ్గరకు వెళతారు. ఆయన దాన్ని స్వీకరించి, ఓ మూల సంతకం పెట్టి, అధికారికి ఫోను చేసి మాట్లాడి.. ‘మాట్లేడేశా.. అక్కడ ఇచ్చేయ్’ అంటారు. అక్కడితో కథ ముగిసిపోతుంది. పని ఎన్నటికి జరుగుతుందనేది దేవుడికెరుక.

ప్రజలు ఇలా ప్రభుత్వం విధిగా తమకు చేసి తీరవలసిన సేవల గురించి ఉమ్మడిగా, ఉద్యమ సదృశంగా ప్రశ్నించడానికి తగినంత సిద్ధంగా లేరు.

కానీ, తమ ఓట్లకు పార్టీల వాళ్లు డబ్బులు ఇవ్వలేదని అర్థం కాగానే.. గుంపులుగా వెళ్లి వాళ్ల కార్యాలయాల మీద పడి నిలదీయడం మాత్రం వారికి చేతనవుతుంది. అందుకు సరిపడా చైతన్యం ఉంది. మనందరం సిగ్గుపడాల్సిన విషయం ఇది. ఎందుకిలా జరుగుతోంది? ప్రభుత్వం ద్వారా తాము హక్కుగా పొందవలసిన  వాటి కంటె, తమ ఓటుకు రెండువేలో, మూడు వేలో డబ్బు తీసుకోవడం ఇంకా పెద్ద హక్కు అని వారందరూ మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. నిజమే ఓటును అమ్ముకోవడం హక్కు అని వారు త్రికరణశుద్ధిగా అనుకుంటున్నారు.

అలా కాకపోతే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. ఓట్లకు డబ్బు కావాలని.. ఏదో లోకల్ లీడర్లను ప్రాధేయపడడం, బేరాలాడడం, చాటుమాటుగా నాయకులను ఆశ్రయించి అడగడం జరిగేది. ఇప్పుడలా లేదు. రోజులు మారాయి. వచ్చే ఎన్నికల నాటికి.. ఎన్నికల ప్రచారం పేరుతో ఇంటింటికీ వచ్చే అభ్యర్థిని.. ‘ఈ ప్రచారమూ, దండాలు పెట్టడమూ, వాగ్దానాలు ఇవ్వడమూ ఇవన్నీ తరువాత… ముందు మా ఓటుకు ఎంత ఇస్తావో చెప్పు, ఎప్పుడిస్తావో, ఎవరి ద్వారా పంపుతావో కూడా చెప్పు..’ అని షర్టు కాలర్ పట్టుకుని మరీ అడిగి ఖరారు చేసుకునే రోజులు వస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

అవును- రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల గురించి ప్రజలందరికీ సమంగా తెలుసో లేదో గానీ.. ఓటు వేయడానికి డబ్బు తీసుకోవడం హక్కు అని మాత్రం అందరికీ తెలుసు. చాలా హక్కులలాగానే కొందరు, ఆ హక్కును వాడుకోరు, కొందరు వాడుకుంటారు.. కొందరు ఆ హక్కు సాధించుకోవడానికి పోరాటానికి వెనుకాడరు. నిజమే, మన ప్రజలంతా పోరాటశీలురు!!

ఈ చైతన్యం, పోరాటశీలత వారికి ఎక్కడినుంచి వచ్చింది? ఆ చైతన్యాన్ని ప్రసాదించిన పుణ్యం మొత్తం మన నాయకులకే దక్కుతుంది. ఘనత వహించిన మన నాయకులే.. ఏ నాయకులైతే ప్రజాభ్యుదయానికి, సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అని చెప్పుకుంటూ ఉన్నారో.. తమ చేతిలోనే అధికారం పెట్టమని ప్రజలను ప్రాధేయపడుతూ ఉన్నారో వారందరికీ ఈ క్రెడిట్ ను కట్టబెట్టాలి. ఈ వరుసలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్, ఫైర్ బ్రాండ్ షర్మిల అందరూ కూడా ఈ పాపానికి బాధ్యులు.

ప్రధానంగా ఈ నలుగురు నాయకులు ప్రజలను తమ ఓటుకోసం డబ్బు తీసుకోవాల్సిందిగా విపరీతంగా ప్రేరేపించారు. ‘డబ్బులిస్తారు తీసుకోండి’ అంటూ ఊదరగొట్టారు. ఈ విషయంలో ఎవ్వరూ తక్కువ కాదు. 

‘‘చంద్రబాబునాయుడు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చాలా డబ్బు  సంపాదించారు. అదంతా మీ డబ్బే. ఒక్కో ఓటుకు నాలుగైదు వేల రూపాయలు ఇవ్వబోతున్నారు… ఆ డబ్బంతా మీదే, నిరభ్యంతరంగా తీసుకోండి’’ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

‘‘జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల జేబులను కొల్లగొట్టి లక్ష కోట్ల రూపాయలకు పైగా వెనకేశాడు. ఇసుక, భూకబ్జాలు, లిక్కర్ మాఫియాలు నడిపించి వేల కోట్ల రూపాయలు మీ సొమ్మే దోచుకున్నారు. ఓటుకు అయిదువేల రూపాయలు ఇస్తారు.. ఖచ్చితంగా తీసుకోండి’’మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.

‘‘పిఠాపురంలో నన్ను ఓడించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు డబ్బు సంచులు బయటకు తీస్తున్నారు. ఒక్కో ఓటుకు పదివేల రూపాయలు ఇచ్చి అయినా సరే.. నన్ను ఓడించాలని అనుకుంటున్నారు.. ఆ డబ్బంతా మీదే తప్పకుండా తీసుకోండి’’ – జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.

‘‘జగనన్న విచ్చలవిడిగా ప్రజల సొమ్ముు దోచుకున్నాడు. అదంతా మీదే. ఓటుకు పదివేల రూపాయల వంతున ఇచ్చి మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నాడు.. ఆ డబ్బును వద్దనకుండా తీసుకోండి’’ ఏపీసీసీ సారథి వైఎస్ షర్మిల.

ఈ నలుగురు నాయకులు కూడా ఈ మాటలు చెప్పిన ప్రతిసారీ, కామన్ గా చెప్పిన మరొక మాట కూడా ఉంది. ‘‘వారిచ్చే డబ్బులు తీసుకోండి.. ఓటు మాత్రం మాకే వేయండి’’ అనేది! ఓటు ఎవరికైనా వేసుకోవచ్చు అనే సంగతి తర్వాత.. ‘ఓటుకు డబ్బు ఇస్తారు మనం తప్పకుండా తీసుకోవాలి’ అనే పాయింట్ మాత్రం ప్రజల్లో ప్రతి ఒక్కరికీ స్పష్టంగా అర్థమైంది.

ఈ నాయకులు ఎవ్వరూ ఈ మాటల్ని చాటుమాటుగా చెప్పలేదు. బహిరంగ సభల్లో వేలమంది ప్రజల ఎదుట, మీడియా వీడియో రికార్డింగులు జరుగుతూ ఉండగా బాహాటంగానే చెప్పారు. అందుకే ఓటుకు డబ్బు తీసుకోవడం సిగ్గుపడాల్సిన దొంగపని అనే భావన ఎవ్వరికీ లేకుండా పోయింది. ప్రజలు కూడా బాహాటంగా రోడ్డెక్కి, అభ్యర్థుల ఇళ్లమీదకు దండెత్తి మరీ డబ్బులు అడిగారు. 

ప్రజలు తమ ఓటును అమ్ముకున్నంత వరకు ప్రజాస్వామ్యం బాగుపడదు వంటి పడికట్టు డైలాగులను మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. కవిత్వాలు రాస్తాం, కథలు రాస్తాం, ప్రవచనాలు చెబుతాం, వాట్సప్ మెసేజీలను పంచేసుకుంటూ ఉంటాం, స్టేటస్ పెట్టుకుని మురిసిపోతూ ఉంటాం. స్వయంగా అగ్రనాయకులంతా ఇలా ప్రజలను పురిగొల్పుతూ ఉంటే.. డబ్బు తీసుకోవడం మా హక్కు అని వారు పెట్రేగుతూ ఉంటే ఏం చేయగలం? తప్పు ఎవరిదని చెప్పాలి.. తీసుకునే ప్రజలదా? అందుకు పురిగొల్పుతున్న వారిదా?

ప్రజలు ఎన్నికలలో తమ హక్కును వినియోగించుకోవడానికి గాను వారికి ఏదైనా  వారికి ఇష్టమైనది ముట్టజెప్పడం, ఇవ్వడం అనేది లంచం ఇచ్చే నేరంగా పరిగణింప బడుతుంది. అలా తీసుకోవడం కూడా నేరమే అవుతుంది. ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 171 బిలో ఈ విషయం చాలా స్పష్టంగా ఉంది. అంటే ఓటు వేయడం కోసం ప్రలోభ పెట్టడమూ, అలాంటి ప్రలోభానికి లొంగి డబ్బు లేదా కానుక ఏదైనా తీసుకోవడమూ రెండూ నేరమే అవుతాయి. bribery అనే నిర్వచనం కిందికి ఇవన్నీ వస్తాయి.

లంచం అంటే మనం సాధారణంగా అధికారులకు ఇచ్చేది మాత్రమే అనుకుంటూ ఉంటాం. మనం తీసుకునేది కూడా అదే కోవకు చెందుతుందనేది మనకు తెలియదు! తెలియనట్టుగా ఉంటాం!! అది ఖచ్చితంగా నేరం. ఈ నేరానికి సెక్షన్ 171 ఇ ప్రకారం లంచం అనే  నేరానికి ఏడాది జైలుశిక్ష గానీ, జరిమానా గానీ, రెండూగానీ విధించవచ్చు. ఓటుకు డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు, డబ్బు తీసుకోవడం కూడా నేరం అని పీనల్ కోడ్ లోని ఈ సెక్షన్ల ప్రకారం మనకు విశ్వాసం కలిగిన తర్వాత.. రెండో భాగం ఏమిటో చూద్దాం.

ఇదే ఇండియన్ పీనల్ కోడ్ లో అబెట్‌మెంట్ (నేరానికి పురిగొల్పడం, ప్రేరేపించడం) కు సంబంధించి సెక్షన్ 107 కూడా ఉంటుంది. ఒక వ్యక్తి ఒక నేరం చేసేలాగా మాటలతో ప్రోత్సహించడం, అలాంటి పరిస్థితిని కల్పించడం, మరొకరితో కలిసి కుట్ర చేయడం, నేరం చేయడానికి ఉద్దేశపూర్వకంగా సాయం చేయడం..  ఇవన్నీ ఈ నేరం కిందికి వస్తాయి. ‘ప్రేరేపణ’ అనేది నేరుగా గానీ, పరోక్షంగా గానీ, రాతలు లేదా మాటలతో గానీ, సంకేతాలతో చేసినగానీ నేరమే అవుతుందని ఆ సెక్షను చెబుతుంది. ఈ అబెట్‌మెంట్ అనే నేరానికి ఇంకా తీవ్రమైన శిక్షలు కూడా ఉంటాయి. అయితే ఇవన్నీ ఏ నేరానికి ప్రేరేపించడం జరిగింది అనే దాన్ని బట్టి మాత్రమే ఉంటాయి. 

చట్టాల్లోని ఈ అంశాలను తెలుసుకున్న తరువాత.. ఏపీలో గాడితప్పిపోయిన ప్రజాస్వామ్య వ్యవస్థకు బాధ్యులుగా మనం ఎవరెవరి మీద కేసులు పెట్టాలా? అనే సందేహం మొదలవుతుంది. రాష్ట్రంలో ఇవాళ కొన్ని లక్షల మంది ప్రజలు ఓటును అమ్ముకోవడం అనే నేరం చేస్తున్నారంటే.. అది నేరమనే స్పృహ కూడా లేకుండా హక్కులాగా భావిస్తూ రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారంటే.. వారినందరినీ అలా తయారుచేసిన వారి మీద కూడా కేసులు పెట్టాలి కదా.

మనం ఎవరినైతే పద్నాలుగేళ్ల అనుభవం ఉన్న దక్షత గల ముఖ్యమంత్రిగా గౌరవిస్తున్నామో.. ఎవరినైతే సంక్షేమ పథకాలే పాలనసూత్రంగా భావించి ప్రజలను గెలుచుకోవచ్చునని భావించిన ముఖ్యమంత్రిగా ఆదరిస్తున్నామో.. ఎవరినైతే స్వచ్ఛంగా నీతిగా ఉంటే చాలు, ముఖ్యమంత్రి పదవికేం తొందరలేదు అని నిర్ణయించుకున్న వ్యక్తిగా నమ్ముతున్నామో.. ఎవరినైతే అదను దాటిపోయిన తర్వాత ఆలస్యంగా వచ్చి, అన్నయ్య తనకు అన్యాయం చేశాడని రాజకీయ ఉనికికోసం పోరాడుతున్న అమాయకురాలిగా చూస్తున్నామో.. వారందరూ కూడా ప్రజలను సమాజాన్ని సామూహికంగా, నేరానికి పురిగొల్పన దోషులే. వారందరి మీద కూడా ఐపీసీ 107 సెక్షను కింద కేసులు పెట్టాలి. 

నాయకులు ఎన్నికల్లో గెలవడానికి తాము చేసిన గొప్ప పనులను అదే పనిగా చెప్పుకుంటూనే ఉంటారు. ఏం చేయబోతామో వందల రకాల వాగ్దానాలు చేస్తుంటారు. ప్రత్యర్థుల అవినీతి, అసమర్థతల గురించి అనేక విషయాలు వెల్లడిస్తుంటారు. ప్రజల నమ్మకాన్ని చూరగొనడానికి ఇంకా వారివద్ద అనేక మార్గాలుంటాయి. ఇవన్నీ పనిచేస్తాయో లేదో అనే భయం వారికి ఉంటుందో ఏమో గానీ.. ఇలా ఓటుకు డబ్బు తీసుకోమనం సూచిస్తూ ప్రజలను నేరానికి ప్రేరేపించడం ఎందుకు?

ఓటు కొనుగోలు అనేది ఒక దుర్మార్గం, అనివార్యంగా ఎన్నికల ప్రక్రియలోకి చొరబడిపోయి ఉండవచ్చు. కానీ.. బాధ్యతగల ఉన్నత పదవుల్లోని, పదవులను ఆశించే ఈ నాయకులు అలాంటి దుర్మార్గాన్ని తమ మాటలతో సమర్థించడం ఎందుకు? అనే అభిప్రాయం మనకు కలుగుతుంది. ప్రజాస్వామ్యం బాగుపడాలంటే ప్రజలు మారాలి అనే మాట చాలా మంది అంటూ ఉంటారు. కానీ నిజంగా మారాల్సింది ఎవరు?

.. కె.ఎ. మునిసురేష్ పిళ్లె

సీనియర్ జర్నలిస్ట్ 

[email protected]