ఎన్నికల ఫలితాలపై నాయకులు లెక్కలేస్తున్నారు. మీడియాతో మాట్లాడే సందర్భంలో ఎన్ని ప్రగల్భాలు పలికినా… అంతర్గత సమీక్షల్లో మాత్రం నిజాలు మాట్లాడుకుంటున్నారు. అయితే మీడియాతో కూడా నిజాలే మాట్లాడి… చంద్రబాబుకు ఆయన పార్టీ పార్టీ నాయకుడు షాక్ ఇచ్చారు. విశాఖ ఫలితాలపై ఆ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ దిమ్మతిరిగే వాస్తవాలు చెప్పారు.
విశాఖ నార్త్‌తో పాటు మరో రెండు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ఓడిపోతున్నట్టు గండి బాబ్జీ తెలిపారు. విశాఖ టీడీపీ కార్యాలయం వేదికగా ఆయన ఎన్నికల ఫలితాలను నిర్మొహమాటంగా వివరించడం గమనార్హం. నార్త్ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్‌రాజుకు ఓటమి తప్పదని ఆయన తేల్చి చెప్పడం టీడీపీకి షాక్ ఇస్తోంది. అలాగే మరో రెండు స్థానాల్లో ఓటమి తప్పదన్నారు.
గత ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా… విశాఖలో మాత్రం బొక్క బోర్లా పడింది. విశాఖలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లోనూ టీడీపీనే గెలిచింది. అలాగే గత ఎన్నికల్లో విశాఖ జిల్లాలో కేవలం రెండు స్థానాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించింది. విశాఖ ఎంపీ ఎన్నికల్లో మాత్రం జనసేన అభ్యర్థి , సీబీఐ మాజీ అధికారి లక్ష్మినారాయణ ఓట్లు చీల్చడంతో వైసీపీ గెలుపొందింది.
ఈ నేపథ్యంలో అధికారంలోకి వస్తామని ఎల్లో కూటమి ఉధృతంగా ప్రచారం చేసుకుంటున్న తరుణంలో విశాఖలో రెండు మూడు స్థానాల్లో టీడీపీ ఓడిపోతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెప్పడం చర్చనీయాంశమైంది. బాబ్జీ మాటలు చంద్రబాబు వింటే… అంతే సంగతులని నెటిజన్లు వెటకరిస్తున్నారు. విశాఖలో ఆ పరిస్థితి వుంటే అధికారంలోకి ఎలా వస్తారనే చర్చకు తెరలేచింది.