చంద్ర‌గిరిలో బైపోల్‌.. లాజిక్ మిస్ అయిన నాని!

చంద్ర‌గిరి టీడీపీ అభ్య‌ర్థి పులివ‌ర్తి నానికి పూర్తిగా మైండ్ పోయిన‌ట్టుంది. ఏం మాట్లాడుతున్నారో ఆయ‌న‌కే అర్థం కావ‌డం లేదు. తిరుప‌తిలో త‌న‌ను హ‌త్య చేయాల‌నే ప్ర‌చారం చేసుకోవ‌డం ద్వారా సానుభూతి, అలాగే టీడీపీ పెద్ద‌ల…

చంద్ర‌గిరి టీడీపీ అభ్య‌ర్థి పులివ‌ర్తి నానికి పూర్తిగా మైండ్ పోయిన‌ట్టుంది. ఏం మాట్లాడుతున్నారో ఆయ‌న‌కే అర్థం కావ‌డం లేదు. తిరుప‌తిలో త‌న‌ను హ‌త్య చేయాల‌నే ప్ర‌చారం చేసుకోవ‌డం ద్వారా సానుభూతి, అలాగే టీడీపీ పెద్ద‌ల గుడ్‌లుక్స్‌లో ప‌డాల‌నే తాప‌త్ర‌యం ఆయ‌న‌లో క‌నిపిస్తోంది. తిరుప‌తి ప‌ద్మావ‌తి మ‌హిళా యూనివ‌ర్సిటీలో నానిపై దాడిని ప్ర‌తి ఒక్క‌రూ ఖండిస్తున్నారు. అయితే ఆ దాడికి ముందు ఏం జ‌రిగిందో కూడా మాట్లాడుకుంటున్నారు. అందుకే చంద్ర‌గిరిలో చెవిరెడ్డి, నాని దొందు దొందే అని ప్ర‌జ‌లు నిట్టూర్చుతున్నారు.

ఇదే సంద‌ర్భంలో నాని నాట‌కాన్ని క‌ట్టి పెట్టాల‌నే డిమాండ్ కూడా వ‌స్తోంది. చంద్ర‌గిరిలో తాను గెలుస్తాన‌నే భ‌యంతోనే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి హ‌త్య చేయించ‌డానికి ప్ర‌య‌త్నించార‌నేది నాని ఆరోప‌ణ‌. అలాగే తాను చ‌నిపోతే ఉప ఎన్నిక వ‌స్తుంద‌నే ఆశ చెవిరెడ్డిలో వుంద‌ని ఆయ‌న అంటున్నారు. ఉప ఎన్నిక‌లో త‌న భార్య సుధ నిల‌బెడుతుంద‌ని నాని చాలా క‌బుర్లే చెప్పారు. ఇక్క‌డే నాని లాజిక్ మిస్ అయ్యారు.

తాజా ఎన్నిక‌ల్లోనే చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి గెల‌వ‌లేక‌పోతే, ఉప ఎన్నిక‌లో మాత్రం ఎలా విజ‌యం సాధిస్తార‌నే ప్ర‌శ్న‌కు నాని స‌మాధానం చెప్పాలి. పైగా త‌న‌కు ఏదో జ‌రిగి, భార్య సుధారెడ్డి పోటీ చేస్తే మ‌రింత సానుభూతి వ‌స్తుంద‌ని నానికి తెలియ‌కుండానే మాట్లాడార‌ని అనుకోవాలా? చెవిరెడ్డి ఏమైనా అంత అమాయ‌కుడిగా క‌నిపిస్తున్నారా? ఏదో ఒక‌టి మాట్లాడి సానుభూతి పొందాల‌ని నాని త‌పిస్తున్న‌ట్టున్నారు. ఈయ‌న‌కు తోడు భార్య సుధారెడ్డి ఓవ‌రాక్ష‌న్‌తో చంద్ర‌గిరి మాత్ర‌మే కాదు… తిరుప‌తి జిల్లాలోని అన్ని పార్టీ నాయ‌కులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ప్ర‌తిదీ డ్రామానా? అని సొంత పార్టీ నేత‌లు కూడా ప్ర‌శ్నిస్తున్న ప‌రిస్థితి.

నానిపై దాడికి ముందురోజు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని ఏం చేయాలనుకుని చుట్టుముట్టి, అత‌ని వాహ‌నాన్ని కాల్చివేశారో నాని, ఆయ‌న భార్య చెబితే బాగుంటుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. చేతిలో ఎల్లో మీడియా వుంది క‌దా అని కేవ‌లం త‌న‌పై దాడిని మాత్ర‌మే హైలెట్ చేస్తూ…. మోహిత్‌రెడ్డి, ఆయ‌న అనుచ‌రుల‌పై దాడుల్ని క‌ప్పి పెట్టాల‌నుకోవ‌డం దుర్మార్గం అని వైసీపీ నేత‌లు అంటున్నారు. ఇప్ప‌టికైనా నాట‌కాలకు స్వ‌స్తి చెప్పి, చంద్ర‌గిరిలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణాన్ని నెల‌కొల్పేందుకు స‌హ‌క‌రిస్తే, నియోజ‌క వ‌ర్గానికి ఎంతో మేలు చేసిన వార‌వుతార‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు.