సుప్ర‌సిద్ధ ర‌చ‌యిత కేతు విశ్వ‌నాథ‌రెడ్డి ఇక లేరు

ప్ర‌సిద్ధ క‌థా, న‌వ‌లా ర‌చ‌యిత కేతు విశ్వ‌నాథ‌రెడ్డి (84) ఇక లేరు. క‌డ‌ప న‌గ‌రంలోని సింగ‌పూర్ టౌన్‌షిప్‌లో భార్య‌తో క‌లిసి ఆయ‌న ఉండేవారు. రెండు రోజుల క్రితం ఒంగోలులో ఉంటున్న కుమార్తె వ‌ద్ద‌కు వెళ్లారు.…

ప్ర‌సిద్ధ క‌థా, న‌వ‌లా ర‌చ‌యిత కేతు విశ్వ‌నాథ‌రెడ్డి (84) ఇక లేరు. క‌డ‌ప న‌గ‌రంలోని సింగ‌పూర్ టౌన్‌షిప్‌లో భార్య‌తో క‌లిసి ఆయ‌న ఉండేవారు. రెండు రోజుల క్రితం ఒంగోలులో ఉంటున్న కుమార్తె వ‌ద్ద‌కు వెళ్లారు. ఇవాళ ఉద‌యం ఐదు గంట‌ల‌కు గుండెపోటుకు గురైన‌ట్టు తెలిసింది. వెంట‌నే ఆస్ప‌త్రికి తీసుకెళ్లి వైద్యం అందించ‌డానికి ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేక‌పోయింది. అప్ప‌టికే ఆయ‌న తుదిశ్వాస విడిచిన‌ట్టు వైద్యులు తెలిపారు.

వైఎస్సార్ జిల్లా ఎర్ర‌గుంట్ల మండ‌లం రంగ‌శాయిపురం ఆయ‌న స్వ‌స్థ‌లం. సాహితీ, విద్యావేత్త‌గా కేతు విశ్వ‌నాథ‌రెడ్డి ల‌బ్ధిప్ర‌తిష్టుడు. రాయ‌ల‌సీమ మాండ‌లికానికి సాహితీ గౌర‌వం తీసుకొచ్చిన ఘ‌న‌త ద‌క్కించుకున్నారు. కేతు విశ్వ‌నాథ‌రెడ్డి క‌థ‌ల‌కు కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు ల‌భించింది. క‌డ‌ప జిల్లా గ్రామ‌నామాల‌పై ప‌రిశోధ‌న‌కు ఆయ‌న డాక్ట‌రేట్ పొందారు. జ‌ర్న‌లిస్టుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి అంబేద్క‌ర్ సార్వ‌త్రిక విశ్వ‌విద్యాల‌యం డైరెక్ట‌ర్‌గా ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు.

క‌డ‌ప‌, తిరుప‌తి, హైద‌రాబాద్ త‌దిత‌ర ప్రాంతాల్లో అధ్యాప‌కుడిగా విశిష్ట సేవ‌లందించారు.  పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఎస్సీఈఆర్‌టీ సంపాదకుడిగా, పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయస్థాయి ప‌లు పాఠ్యపుస్తకాలకు సంపాదకత్వం వహించారు. పాఠ్యప్రణాళికలను రూపొందించాడు. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్య సంకలనాలకు సంపాదకత్వం వహించారు. అరసం (అభ్యుదయ రచయితల సంఘం) అధ్యక్షుడిగా కొంత కాలం ఉన్నారు. 

జప్తు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003) కథా సంపుటాలు, వేర్లు, బోధి అనే న‌వ‌ల‌లు వెలువ‌రించారు. రాయ‌ల‌సీమ మాండ‌లికంలో సాగిన ఈయ‌న ర‌చ‌న‌లు మ‌ట్టి ప‌రిమ‌ళాన్ని వెద‌జ‌ల్లాయి.  ఈయన రాసిన అనేక‌ కథలు   హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఆంగ్లం, రష్యన్ భాషల్లోకి అనువాదం అయ్యాయి.

ఉద్యోగ విర‌మ‌ణ అనంత‌రం పుట్టిన గ‌డ్డ‌పై మ‌మ‌కారంతో క‌డ‌ప‌కు చేరుకున్నారు. ఒక‌ప్పుడు క‌డ‌ప కేంద్రంగా సుప్ర‌సిద్ధ సాహిత్య విమ‌ర్శ‌కుడు రాచ‌మ‌ల్లు రామ‌చంద్రారెడ్డి (రారా) ప్రియ శిష్యునిగా సాహిత్యంలో మెల‌కువ‌లు నేర్చుకున్నారు. రారా దిశానిర్దేశంలో ఉత్త‌మ సాహిత్య ర‌చ‌న‌కు శ్రీ‌కారం చుట్టారు. సాహితీ కురువృద్ధుల్లో కేతు మర‌ణం… అభ్యుద‌య సాహిత్యానికి తీర‌నిలోటు.