ఏపీ భారాసలో అప్పుడే లుకలుకలా?

భారత రాష్ట్ర సమితి రాజకీయంగా వేస్తున్న నడకలు గమనిస్తే.. జాతీయ రాజకీయాలు అంటే.. తెలంగాణ మరియు మహారాష్ట్ర రాజకీయాలు మాత్రమే అన్న చందంగా కనిపిస్తోంది. ఏపీ రాజకీయాల గురించి కేసీఆర్ ఏమాత్రం పట్టించుకుంటున్నట్టు కూడా…

భారత రాష్ట్ర సమితి రాజకీయంగా వేస్తున్న నడకలు గమనిస్తే.. జాతీయ రాజకీయాలు అంటే.. తెలంగాణ మరియు మహారాష్ట్ర రాజకీయాలు మాత్రమే అన్న చందంగా కనిపిస్తోంది. ఏపీ రాజకీయాల గురించి కేసీఆర్ ఏమాత్రం పట్టించుకుంటున్నట్టు కూడా కనిపించడం లేదు. 

తాజాగా భారాస- ఏపీ రాష్ట్ర కార్యాలయాన్ని గుంటూరులో ప్రారంభించారు. సాధారణంగా ఏపీలో రాజకీయం చేసే శ్రద్ధ ఉంటే కేసీఆర్ చేతులమీదుగా ఆ ప్రారంభోత్సవం జరిగి ఉండాలి. కానీ కేసీఆర్ కార్యాలయం వద్ద ఫ్లెక్సి పోస్టరు మీద తప్ప మరెక్కడా కనిపించలేదు. ఏపీ భారాసకు సంబంధించినంత వరకు రాష్ట్ర పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం అంటే అతిపెద్ద కార్యక్రమం. ఈ కార్యక్రమమే అక్కడి పార్టీలో లుకలుకలు ఉన్నాయా అనే అనుమానాలను కలిగిస్తోంది.

ఈ కార్యక్రమానికి ఆ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు హాజరుకాలేదు. కార్యాలయం గుంటూరులోనే ఏర్పాటు అయింది. రావెల గుంటూరు జిల్లాకే చెందిన నాయకుడు. అయినా సరే.. ఆయన కార్యక్రమానికి రాకపోవడం అనేది ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంటోంది.

పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం అనేది తోట చంద్రశేఖర్ చేతుల మీదుగా జరిగింది. తెలంగాణ నుంచి గులాబీ అతిథులెవ్వరూ ఆ కార్యక్రమానికి వెళ్లలేదు. వారింకా ఏపీపై పూర్తిగా శ్రద్ధ పెట్టడం లేదని అనుకోవచ్చు. కానీ రావెల కిశోర్ బాబు ఎందుకు హాజరు కాలేదో అంతుచిక్కని ప్రశ్న.

కేసీఆర్ భారాసను ప్రకటించిన తర్వాత.. అప్పటిదాకా జనసేన పార్టీకి చాలా కీలక నాయకుల్లో ఒకరుగా ఉన్న తోట చంద్రశేఖర్ భారాసలో చేరారు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కూడా తోట చంద్రశేఖర్ ఆ పార్టీలో కీలక నేత. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆయన ఆ పార్టీలో కీలకంగానే చెలమాణీ అయ్యారు. జనసేనకు కీలక ఆర్థిక వనరుల్లో ఒకరుగా ఉన్నారు. 

జనసేన కోసం ఒక టీవీ ఛానెల్ ను కొన్నారు. పత్రిక ప్రారంభించారు. సోషల్ మీడియా బృందాలను పోషించారు. ఆయన భారాసకు వచ్చిన తర్వాత.. ఆయనకు ప్రాధాన్యం దక్కడంలో ఆశ్చర్యం లేదు. కానీ.. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు.. పూర్తిగా ఎందుకు సైడ్ అయిపోయారో ఎవరికీ ఊహకు అందడం లేదు. ఏపీలో ఆ పార్టీ గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు కాబట్టి.. తోటతో రావెలకు విబేదాలు వచ్చాయేమో బయటకు రాలేదు.

కేసీఆర్ ఏపీలో తన పార్టీని ఎంతో కొంత ముందుకు తీసుకువెళ్లే ఆలోచనతో ఉంటే ఇలాంటి లుకలుకలను ఇప్పుడే సర్దేయాలి. అక్కడ పార్టీ ఎలాపోయినా పర్లేదని కేసీఆర్ అనుకుంటే.. పట్టించుకునే అవసరం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.