ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మొట్టమొదటిసారి ఈ నెల 22న కుప్పం వెళ్లనున్నారు. వైఎస్సార్ చేయూత పథకం మూడో విడత నిధులను లాంఛనంగా సీఎం విడుదల చేయనున్నారు. అలాగే కుప్పం మున్సిపాలిటీకి ఇటీవల విడుదల చేసిన రూ.66 కోట్ల నిధులకు సంబంధించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌కు కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కుప్పంలో ఏ గోడ చూసినా జగన్ ఫొటోలు, ఆయనకు సంబంధించిన రాతలతో కనిపిస్తోంది. ముఖ్యంగా వై నాట్ 175/175, ఫస్ట్ టార్గెట్ కుప్పం, జగన్‌కు హృదయపూర్వక ఘన స్వాగతం నినాదాలే కనిపిస్తుండడం విశేషం. దీన్నిబట్టి కుప్పాన్ని వైసీపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదో అర్థం చేసుకోవచ్చు. పులివెందుల తర్వాత కుప్పమే తనకు ప్రాధాన్య నియోజకవర్గంగా జగన్ ఇటీవల ఆ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో అన్నారు. కుప్పంలో వైసీపీ నేత భరత్‌ను గెలిపిస్తే మంత్రి చేస్తానని కూడా జగన్ హామీ ఇచ్చారు.
అలాగే తన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో జగన్ పదేపదే 175కు 175 స్థానాల్లో గెలిచి తీరాల్సిందేనని చెబుతున్న సంగతి తెలిసిందే. కుప్పం మున్సిపాలిటీతో పాటు అన్ని స్థానిక సంస్థల్లోనూ క్లీన్ స్వీప్ చేసిన వైసీపీకి చంద్రబాబును ఓడించడం అసాధ్యం కాదనే భరోసా కల్పిస్తున్నారు. అందుకే ఇంటింటికి వెళ్లి గత మూడేళ్లలో తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించాలని ఆదేశించారు. ప్రస్తుతం వైసీపీ ప్రజాప్రతినిధులు అదే పని చేస్తున్నారు.
ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరికి తన పర్యటననే అడ్డుకోవడంతో చంద్రబాబు షాక్‌కు గురయ్యారు. దీంతో కుప్పంలో టీడీపీ పరిస్థితి దిగజారిందనే వాస్తవాన్ని చంద్రబాబు గ్రహించారు. తాజాగా కుప్పంలో జగన్ పర్యటనను దిగ్విజయం చేసేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 22న కుప్పంలో జగన్ పర్యటన రానున్న ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు ఎంత వరకూ భరోసా నింపుతుందో చూడాలి.