జనసేనాని పవన్ కల్యాణ్ కొత్త నినాదం అందుకున్నారు. జగనన్న కాలనీని సందర్శించే నిమిత్తం ఆయన విజయనగరం జిల్లా పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ తనకు అధికారం ఇవ్వాలని అభ్యర్థించారు. పవన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే…
“అవినీతి కోటల్ని బద్ధలు కొడ్తాం. ప్యూడలిస్టిక్ కోటల్ని బద్ధలు కొడ్తాం. వైసీపీ ప్రభుత్వాన్ని కిందికి ఈడుస్తాం. జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. మీ బంగారు భవిష్యత్ కోసం జనసేనను నమ్మండి. అవినీతి రహిత ప్రభుత్వాన్ని జనసేన తీసుకొచ్చేలా మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. మీ పెద్దలకు చెప్పండి… వచ్చే ఎన్నికల్లో జనసేనకు మద్దతు ఇవ్వాలని. ఒకే ఒక్క చాన్స్. నా కోసం అవకాశం ఇవ్వాలని అడగడం లేదు. మీతో పాటు మీ బిడ్డల భవిష్యత్ కోసం ఒక్క చాన్స్ ఇవ్వాలని అడుగుతున్నా” అని పవన్‌కల్యాణ్ అభ్యర్థించారు.
పవన్‌కల్యాణ్ వేడుకోలుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క చాన్స్ ఇవ్వాలని పవన్ అడగాల్సింది ఎవరిని? అడుగుతున్నదెవరిని? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వనంటున్న పవన్‌కల్యాణ్, చంద్రబాబును సీఎం చేస్తానని పరోక్షంగా చెప్పకనే చెప్పారనే ప్రచారం జరుగుతోంది. తాను మాత్రం చంద్రబాబుకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ, మరోవైపు నిజాలు చెబితే జనం నమ్మరని కొత్త నినాదం అందుకున్నారనే విమర్శలొస్తున్నాయి.
2014లో చంద్రబాబు సీఎం అయ్యేందుకు పవన్‌కల్యాణ్ ప్రచారం దోహదపడింది. 2024లో తాను సీఎం కావడానికి ఒక్క అవకాశం ఇవ్వాలని చంద్రబాబును అడిగితే న్యాయంగా వుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా అడగడమే సరైందని అంటున్నారు. ఎందుకంటే పవన్‌కు చంద్రబాబు రుణపడి ఉన్నారు.
రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని, ఒకే ఒక్క చాన్స్ ఇవ్వాలని చంద్రబాబు దగ్గరికి వెళ్లి వేడుకుంటే లక్ష్యం నెరవేరుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కావున ప్రజలను ఎంత వేడుకున్నా… నిజాలు తెలుసుకాబట్టి పవన్‌ది అరణ్య రోదనగానే మిగులుతుందని అంటున్నారు.