జనసేనాని పవన్‌కల్యాణ్, ప్రధాని మోదీ భేటీ అనేక రకాల రాజకీయ ఊహాగానాలకు కారణమైంది. ఎవరికిష్టమొచ్చినట్టు వారు విశ్లేషిస్తున్నారు. ప్రధానితో భేటీ పవన్ కోరుకున్నట్టుగా జరగలేదనేది మెజార్టీ అభిప్రాయం. పవన్‌కు మోదీ చేసిన హితబోధ ఏంటో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తనదైన శైలిలో చెప్పారు. ప్రధాని మోదీ ఏపీలో పర్యటించడం… పక్కా రాజకీయ ఎత్తుగడలో భాగమని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకొచ్చారని నారాయణ ప్రశ్నించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇంగ్లీష్ బాగా మాట్లాడ్తారన్నారు. కానీ ప్రధాని సభలో తెలుగులో మాట్లాడారని ఆయన చెప్పుకొచ్చారు. తెలుగు ప్రజానీకానికి తాను ఏం అడగానో తెలిసేలా జగన్ మాట్లాడారన్నారు. అలాగే మోదీకి ఏం అడిగానో తెలియకూడదన్నట్టు మాట్లాడారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంతో తమ మైత్రి రాజకీయాలు, పార్టీలకు అతీతమని జగన్ చెప్పడం పచ్చి మోసమని ఆయన ధ్వజమెత్తారు.
రాజకీయ పార్టీలు రాజకీయంగానే ఐక్యతగా వుంటాయి తప్ప, మరో రకంగా ఎలా వుండగలవని ఆయన ప్రశ్నించారు. జగన్ విజ్ఞప్తులపై పొరపాటున కూడా ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించలేదని విమర్శించారు. కేవలం రాజకీయ పబ్బం గడుపుకునేందుకే ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారన్నారు.
ఏపీలో వైఎస్సార్‌సీపీ బలంగా వుండాలనేది ప్రధాని ఆకాంక్షగా నారాయణ చెప్పారు. వైసీపీ బలంగా వుంటే కేంద్రంలో తనకు మద్దతు ఇస్తుందని ప్రధాని ఆలోచన అన్నారు. ఇదే సందర్భంలో టీడీపీని బలహీనపర్చాలని ప్రధాని కోరుకుంటున్నారన్నారు. టీడీపీ బలహీనంగా వుంటే తప్ప ఏపీలో బీజేపీ బలపడదని సీపీఐ నాయకుడు నారాయణ అన్నారు. అలాగే టీడీపీ వైపు పవన్‌కల్యాణ్ వెళ్లకూడదని బీజేపీ కోరుకుంటోందన్నారు. అందుకే పవన్‌కల్యాణ్‌కు ప్రధాని ఘనమైన ఆహ్వానం పంపారన్నారు. పవన్ ప్రత్యేక విమానంలో వెళ్లారన్నారు.
టీడీపీ వైపు వెళ్లొద్దని, నువ్వూనేనూ కలిసే వుందామని పవన్‌కు ప్రధాని మోదీ హితబోధ చేసినట్టు నారాయణ చెప్పారు. అప్పుడు టీడీపీ బలహీన పడుతుందన్నారు. కేవలం రాజకీయంగా బీజేపీని బలపరచడం, అలాగే టీడీపీని దెబ్బ తీసేందుకే ఏపీలో ప్రధాని పర్యటన సాగిందన్నారు. పవన్‌కు ప్రధాని హితబోధపై నారాయణ కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. బీజేపీని వీడితే తాము మరోసారి పవన్‌తో కలిసి పని చేయొచ్చని వామపక్షాల ఆశ. మరి అది ఎంత వరకు నెరవేరుతుందో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.