జగన్ కి తెలివి బాగానే ఉందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు మొత్తానికి మెచ్చుకున్నారు. జగన్ కి పాలనానుభవం లేదని అందరూ అంటారని, అయితే అది తప్పు అని అయ్యన్న అంటున్నారు. జగన్ ఏం చేసినా ఒక వ్యూహం ప్రకారం చేస్తాడని కూడా అన్నారు.
ఇవన్నీ వింటే ఆయన జగన్ కి కితాబులు ఇచ్చారనుకుంటే పొరపాటే. జగన్ కి పాలన కంటే వ్యాపార దృష్టి ఎక్కువైపోయింది అన్నదే అయ్యన్నచేస్తున్న ఘాటైన విమర్శలు. ఆయన ఏం చేసినా డబ్బులు ఎక్కడ వస్తాయా అని చూసి మాత్రమే చేస్తారు అని అయ్యన్న వెటకారం కూడా ఆడారు.
అయ్యన్న బాధంతా ఏంటి అంటే ఏపీలో విద్యా విధానం భ్రష్టు పట్టిపోతోందిట. అంతే కాదు ఏపీలో మూడు నాలుగు అయిదు స్కూళ్ళను హై స్కూల్ లో విలీనం చేయడమేంటని పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవదీశారు. అయితే అయ్యన్న మరచిపోతున్నది ఏంటి అంటే ఇదంతా జాతీయ విద్యా విధానం లో భాగంగానే ఏపీ సర్కార్ అమలు చేస్తోందని మరచిపోవడం అంటున్నారు వైసీపీ నేతలు.
జగన్ తెలివిని వ్యంగ్యంగా అయినా అయ్యన్న అంగీకరించినందుకు వారు ధాంక్స్ చెబుతున్నారు. ఏపీలో విద్యా రంగానికి గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నది వైసీపీ సర్కారే అని, దాన్ని అయ్యన్న లాంటి వారు తెలుసుకోవాలని సూచిస్తున్నారు.