జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డును కైవసం చేసుకున్నారు ఎస్ఎస్ థమన్. తెలుగు సినిమా పాటకు దక్కిన జాతీయ గౌరవం ఇది. అలవైకుంఠపురములో సినిమాకు గానూ థమన్ కు ఈ అవార్డు లభించింది. అల వైకుంఠపురములో పాటలు ఎంత సెన్సేషన్ అయ్యాయి అన్నది కొత్తగా చెప్పనక్కరలేదు. సినిమా విజయానికి ఆ పాటలే కీలకంగా నిలిచాయి. ఇక సోషల్ మీడియాలో, డిజిటల్ ప్లాట్ ఫారమ్ ల్లో ఆ పాటలు సృష్టించిన రికార్డులు ఇన్నీ అనీ కావు. అందువల్ల ఈ అవార్డు కు థమన్ అన్ని విధాలా అర్హుడే.
అవార్డు లభించిన సందర్భంగా థమన్ ను ‘గ్రేట్ ఆంధ్ర’ ఫోన్ లో అభినందించింది. ఈ సందర్భంగా థమన్ మాట్లాడుతూ ‘ఢిల్లీ వెళ్లి అవార్డు తీసుకువచ్చి, దర్శకుడు త్రివిక్రమ్ ఇంట్లో పెట్టి, తాను చెన్నయ్ వెళ్లిపోతా’ అని అన్నారు. ఈ అవార్డు త్రివిక్రమ్ కే తప్ప తనకు కాదన్నారు. అల వైకుంఠపురములో సినిమా పాటల వెనుక అన్నీ త్రివిక్రమ్ నే అని థమన్ వినయంగా వెల్లడించారు.
ఇదిలా వుంటే సత్యం రామలింగరాజు కోడలు సంధ్యారాజు నటించి, నిర్మించిన నాట్యం సినిమాకు కూడా రెండు అవార్డులు లభించాయి. ఉత్తమ కొరియోగ్రఫీ, ఉత్తమ మేకప్ విభాగాల్లో అవార్డులు వచ్చాయి.
ఉత్తమ ప్రాంతీయచిత్రంగా కలర్ ఫొటో ఎంపికయింది.