వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన మీద అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. రాజశేఖర రెడ్డి పదే పదే చెప్పే ఆ రెండు పత్రికలు (ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతి) ఆయన మీద అవినీతి ఆరోపణలు గుప్పించాయి. జలయజ్ఞం పేరుతో దోచుకున్నారని విరుకుపడ్డాయి. అప్పుడే ఒక పదం బాగా పాపులరైంది. ఆ పదమే క్విడ్ ప్రో కొ. దీన్ని గురించి అప్పటివరకు ఎవరూ వినలేదు.
క్విడ్ ప్రో కొ అనే పదానికి సింపుల్ మీనింగ్ ఏమిటంటే …పరస్పర సహకారం. అంటే నీకు నేను ఈ పని చేసిపెడతాను …నువ్వు నాకు ఆ పని చేసి పెట్టు అని. అప్పట్లో రాజశేఖర రెడ్డి కొందరు పెద్ద తలకాయలతో మీకు కావలసింది నేను చేసిపెడతాను. మీరు నా కుమారుడు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టండి అన్నారట.
దీంట్లో నిజానిజాలేమిటో తెలియవు గానీ ఈ ప్రచారం బాగా పెరిగిపోయి వైఎస్సార్ కు చెడ్డపేరు వచ్చింది. ఆయన కుమారుడు జగన్ కోసుల్లో ఇరుక్కోవలసి వచ్చింది. ఇంతకూ ఈ క్విడ్ ప్రో కొ అనేది కొత్తదేమీ కాదు. ఎప్పటినుంచో ఉంది. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక ముందు కూడా ఉంటుంది. పరస్పర సహాయం అనేది డబ్బు రూపంలోనే ఉండనక్కరలేదు.
ఏ రూపంలోనైనా ఉండొచ్చు. క్విడ్ ప్రో కొ కు దేశంలో ఏ రాజకీయ పార్టీ అతీతం కాదు. ఏ నాయకుడూ అతీతుడు కాదు. ఇందుకు తాజా ఉదాహరణ ఒకటి చెప్పుకోవాలి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా (ప్రధానంగా బీజేపీ అభ్యర్థి అని చెప్పుకోవచ్చు) ద్రౌపది పోటీ చేయడం, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేయడం తెలిసిందే.
ద్రౌపది ముర్ము భారీ మెజారిటీతో గెలిచారు కూడా. బీజేపీని భీకరంగా వ్యతిరేకించే కొన్ని పార్టీలు కూడా కొన్ని కారణాలవల్ల యూ టర్న్ తీసుకొని ముర్ముకు మద్దతు ఇచ్చాయి. యూపీలో సమాజ్ వాదీ పార్టీ బీజేపీకి బద్ధ శత్రువు. దీనికి సుహల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్ బీ ఎస్ పీ) అనే మిత్రపక్షం ఉంది. థియరీ ప్రకారం సమాజ్ వాదీ పార్టీ బీజేపీకి వ్యతిరేకమైనప్పుడు మిత్రపక్షం కూడా వ్యతిరేంగా ఉండాలి కదా. కానీ రాష్ట్రపతి ఎన్నికకు ముందు సుహల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాష్ రాజభర్ ఢిల్లీ వెళ్లి అమిత్ షా ను కలిసి మాట్లాడారు. ముర్ముకు మద్దతు ప్రకటించారు.
ఆ తరువాత ఆయనకు జరిగిన ప్రయోజనం ఏమిటి? కేంద్ర ప్రభుత్వం ఆయనకు వై కేటగిరి భద్రత కల్పించింది. అప్పటినుంచి ఆయన బీజేపీకి మద్దతుగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇలా పరస్పరం ప్రయోజనం పొందారన్న మాట.