అఖండ గోదావరి రాజమహేంద్రవరం దగ్గర కనిపిస్తుంది. ఎక్కడో మహారాష్ట్రలో పుట్టి తెలంగాణాను దాటుకుని ఏపీలో పరుగులు తీస్తు రాజమహేంద్రవరం దగ్గర గోదారమ్మ స్థిరపడుతుంది. అయితే వరదలు వస్తే ప్రసన్న గోదావారి ఉగ్ర రూపమే అంతా చూస్తారు.
ఇంతటి గోదావరిలోకి వచ్చే నీరు కేవలం ఆ నదీమతల్లిదే కాదు అందులో ఉప నదుల వాటా చాలానే ఉంది. ముఖ్యంగా గోదావరి నీరంతా ఉత్తరాంధ్రాలోని తూర్పు కనుమలలో వున్న సీలేరు, శబరి, ఇంద్రావతి నుండి వస్తుందని చెబుతున్నారు. అలా వచ్చే అదనపు జల సంపదే గోదావరి కళకళలకు కారణం అని అధ్యయనకారులు అంటున్నారు.
అందువల్ల గోదావరి నదిలో అసలైన వాటా ఉత్తరాంధ్రాదని వారు వాదిస్తున్నారు. గోదావరి నది మీద ధవలేశ్వరం వంతెనను నాటి తెల్లదొరలు కట్టడంతో కోస్తా జిల్లాలకే గోదారమ్మ సొంతం అన్న భావన ఏర్పడిందని, ఇక టీడీపీ ఏలుబడిలో పట్టిసీమను కట్టి లిఫ్టింగ్ ద్వారా ఎనభై టీఎంసీల నీరు క్రిష్ణలో కలిపేసిన తరువాత పోలవరం అవసరం కూడా ఎంతవరకు అని ఆలోచన చేయాలని నిపుణులు అంటున్నారు.
ఒక విధంగా చెప్పాలంటే గోదావరి నదిలో ఉత్తరాంధ్రాకు పెద్ద వాటా ఉందని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా మించిపోయినది లేదు ఉత్తరాంధ్రకు శబరి,సీలేరు ద్వారా గోదావరిలో వచ్చే అదనపు నీరు గుంతవాడ దగ్గర లిఫ్ట్ చేసి ఆదివాసీ ప్రాంతాలకు గ్రావిటీ తో బహుదా వరకు ఉత్తరాంధ్ర కు నీళ్ళు యివ్వడం ద్వారా వరద సమస్య తగ్గించుకోవచ్చు అని సూచిస్తున్నారు.
గోదావరి వరదలకు కారణమై వచ్చే నీరంతా సీలేరు, ఇంద్రావతిదే కాబట్టి ఇప్పటికీ నీట మునిగి డెల్టా కంటే ఉత్తరాంధ్రకు ఇవ్వడం ద్వారా పరిష్కారం కొరకు వైసీపీ సర్కార్ ఒక కమిటీ వేసి చూడాలని పేర్కొంటున్నారు.
ఉత్తరాంధ్రకు అల్లూరి జిల్లాతో సహా ఆదివాసీ జిల్లాల హక్కు అయిన గోదావరి నీరు ఆదివాసీ ప్రాంతాలకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ఉత్తరాంధ్రా అధ్యయన వేదిక ప్రతినిధులు లేఖ రాశారు.