సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారిగా విచారణను ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఎన్నికల్లో ఉచితాలపై విచారణను సుప్రీంకోర్టు ప్రత్యక్ష ప్రసారం చేయడం విశేషం. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం పలు కీలక కేసుల విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఎన్వీ రమణకు శుక్రవారం చివరి రోజు.
సుప్రీంకోర్టులో కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసిన ఘనత ఎన్వీ రమణకే దక్కుతుంది. ఇది ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన గౌరవంగా చెప్పుకోవచ్చు. పదవీ విరమణ తర్వాత రెండేళ్ల పాటు ఢిల్లీలోనే వుంటానని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్వీ రమణ న్యాయవాదిగా ప్రస్తానాన్ని మొదలు పెట్టి, అంచెలంచెలుగా ఎదుగుతూ అత్యున్నత పదవిని అలంకరించారు.
కొన్ని సందర్భాల్లో వివాదాలకు ఆయన అతీతంగా వుండలేకపోయారు. అయినప్పటికీ అన్నింటినీ ఎదుర్కొని నిలబడ్డారు. సాహిత్య ప్రియుడిగా, మానవతా వాదిగా తనను తాను ఆవిష్కరించుకున్నారు. తెలుగు సమాజంపై మమకారాన్ని దాచుకోలేదు. తెలుగు సమాజంలో చిన్న కార్యక్రమం అయినా, హాజరై ఆశీస్సులు అందిస్తూ వచ్చారు.
ఇటీవల తిరుపతి పర్యటనలో గాంధీజీ ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పదవీ విరమణ రోజు జీవితంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనలపై స్పందిస్తానని ఆయన చెప్పారు. ఆయనేం మాట్లాడ్తారనే అంశంపై ఉత్కంఠ నెలకుంది.