కుప్పంలో వీళ్లు కర్రలు పట్టుకున్నారు…వాళ్లు రాళ్లు విసిరారు. విశాఖలో లోకేష్ ను అడ్డుకున్నారు. వీళ్ల పత్రికల్లో వాళ్లదే తప్పు..వాళ్ల పత్రికల్లో వీళ్లదే తప్పు. సాయంత్రం వేళల్లో నిలయ విద్వాంసులతో ఎవరికి వారు టీవీల్లో భీకర చర్చలు. ఇదే ఇప్పుడు ఆంధ్రలో డైలీ రొటీన్ అయిపోయింది. చూస్తుంటే మరో ఏణ్ణర్థం ఇలాగే వుండేలా వుంది రాజకీయం అంతా. వీళ్లకు అధికారం వుంది. పోలీసుల అండ వుంది. వాళ్లకు అధికారం కావాలి. ఇప్పుడు రాకపోతే మరి ఇక పార్టీనే మరచిపోవచ్చు. తెగింపు ఒకరి. తెగించాల్సిన అవసరం ఇంకొకరిది.
వైకాపా-తేదేపా శ్రేణులు వేటికవే రెచ్చిపోతున్నాయి. మర్నాడు తమ పత్రికలకు బ్యానర్ వార్తలు వుండాలి. సాయంత్రం వేళకు తమ చానెళ్లకు డిస్కషన్ పాయింట్లు వుండాలి. వైకాపా పాలన అంతా అరాచకం అన్నట్లు జనాలకు కనిపించాలి. ఇదే ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. అటు ఇటు చేసైనా, తెలుగుదేశం పార్టీని మరొక్కసారి అధికారానికి దూరంగా వుంచగలగాలి అనే ఆలోచనతో సాగుతోంది వైకాపా.
దీనివల్ల మీడియా సంగతి అలా వుంచితే తెలుగునాట రాజకీయం రాజుకుంటోంది. నిన్న మొన్న విశాఖ కావచ్చు. కుప్పం కావచ్చు. రేపు మరో ఏరియా కావచ్చు. ఇక ఇదే తీరు సాగేలా కనిపిస్తోంది చూస్తుంటే. అలా అని వైకాపా తగ్గచ్చు కదా అని సులువుగా అనేయవచ్చు. రెచ్చగొట్టే ధోరణిలో సాగుతుంటే, తన అధికారం మీదకే వస్తుంటే ఎందుకు తగ్గుతుంది అని సమాధానం అక్కడే వినిపిస్తుంది. పోనీ, వైకాపా విధానాలను సున్నితంగా ఎండగట్టవచ్చు కదా తెలుగుదేశం అని అంటే, బలమైన శతృవును ఎంత బలంగా ఢీకొంటే అంత మంచిది కదా అనే మాట వినిపిస్తుంది.
అందువల్ల ఇప్పుడు రానున్నది భయంకర ఎన్నికల యుద్దం అని అర్థం అయిపోతోంది. ఈ రావణకాష్ఠం చల్లారాలి అంటే ఎన్నికలు పూర్తి కావాల్సిందే. అంత వరకు ఈ ఘర్షణలు అలా సాగుతూనే వుంటాయి. కానీ ఇక్కడ ఒకటే సమస్య. ఈ రాజకీయ యుద్దంలో సమిధలయ్యేది ఎవరు? సామాన్య కార్యకర్తలు..చోటా మోటా నాయకులు. వీళ్లకే గాయాలు. వీళ్ల పైనే కేసులు. వీళ్లు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టానా, వాళ్లు హత్యాయత్నం కేసులు పెట్టినా వీళ్లకే అన్నీ. జగన్, చంద్రబాబు, పెద్ది రెడ్డి, లోకేష్ వీళ్లంతా బాగానే వుంటారు. కోర్టులు, పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరగలేక జీవితాలు పాడు చేసుకునేది సామాన్యులే.
ఈ యుద్దం సోషల్ మీడియా యుద్దం లాంటిది కాదు. నోటికి తోచినక కామెంట్లు, బూతులు పెట్టేసి, ఫేక్ ఐడి లతో పోరాటం కాదు. గ్రౌండ్ లు నిల్చుని చేసే యుద్దం. ఏ ప్రభుత్వం వున్నా ఆ ఊళ్లోనే బతకాలి. అక్కడే వుండాలి. క్లీన్ రికార్డు కాస్తా క్రిమినల్ రికార్డుగా మారిపోతే భవిష్యత్ బద్నామ్ అయిపోతుంది. ఇప్పుడు కర్రలు, కత్తులు పట్టుకున్నపుడు బాగానే వుంటుంది. కానీ వీడియో, డిజిటల్ రికార్డుల్లో ఆ వీరంగాలు పక్కాగా రికార్డు అయినపుడే అసలు బాధ తెలుస్తుంది.
ఇక్కడ ఇంకో భయం కూడా వుంది. ఆంధ్రలో అధికార మార్పిడి జరిగినపుడల్లా కొన్ని ప్రాంతాల్లో రాజకీయ హత్యలు అన్నది కామన్. ఈ పార్టీ వస్తే ఆ పార్టీవారిని లేపేయడం, ఆ పార్టీ వస్తే ఈ పార్టీ వారిని లేపేయడం అన్నది అనాదిగా జరుగుతోంది. కానీ ఇప్పుడు ట్రెండ్ చూస్తుంటే ఎన్నికల తరువాత కన్నా ఎన్నికల ముందే ఇలాంటి దారుణాలు చోటు చేసుకంటాయోమో అన్న భయమూ తప్పడం లేదు.