కుప్పంలో చంద్రబాబు కోట కుప్పకూలిందని మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్య చేశారు. కుప్పంలో చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత నెలకున్న నేపథ్యంలో ఆర్కే రోజా సీరియస్‌గా స్పందించారు. చంద్రబాబుకు మతిపోతోందన్నారు. ఆయన్ను పిచ్చాస్పత్రిలో చేర్చాలని ఘాటుగా అన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా కలిసినప్పటి నుంచి చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిందన్నారు.
చంద్రబాబునాయుడు, లోకేశ్‌లపై విరుచుకుపడడంలో మంత్రి రోజా ఎప్పుడూ ముందుంటారు. ప్రస్తుతం కుప్పం పరిణామాలను రాజకీయంగా వాడుకోవాలని టీడీపీ చూస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు సన్నద్ధమవుతోంది. కుప్పంలో తనపై దాడికి ప్రయత్నించారని, వైసీపీ అరాచక పాలన సాగిస్తోందనే నెగెటివ్ సంకేతాల్ని తీసుకెళ్లేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా ఎదురు దాడికి దిగారు.
అయితే చంద్రబాబు, టీడీపీ నేతలకు వైసీపీ నుంచి దీటైన కౌంటర్ కరువైంది. ఈ నేపథ్యంలో రోజా ముందుకొచ్చారు. చంద్రబాబుపై తన మార్క్ పంచ్‌లను విసిరారు. కుప్పంలో చంద్రబాబు పనై పోయిందని రోజా ఎదురు దాడికి దిగారు. ఆయన మానసిక స్థితిపై కూడా ఆమె అనుమానాల్ని కల్పించేందుకు యత్నించారు. రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా లాక్కొచ్చి చంద్రబాబుపై విమర్శలు చేశారు.
కుప్పంలో చంద్రబాబుకు రాజకీయంగా నూకలు చెల్లడం వల్ల రెచ్చిపోయి మాట్లాడుతున్నారనే ప్రచారాన్ని వైసీపీ మొదలు పెట్టింది. కుప్పం కేంద్రంగా రెండు పార్టీలు పరస్పరం రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.