సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు వుంది. దీంతో ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ సారి అధికారంలోకి రాకపోతే పార్టీ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్న చంద్రబాబునాయుడు, జనసేనతో పొత్తు కుదుర్చుకునేందుకు నానా యాతన పడుతున్నారు. అటు వైపు నుంచి కూడా సానుకూల సంకేతాలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక అధికార పార్టీ విషయానికి వస్తే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్‌చార్జ్‌లను ప్రజల్లోకి వెళ్లాలని పదేపదే చెబుతున్నారు. గడప గడపకూ పేరుతో ప్రజల చెంతకు ప్రజాప్రతినిధులు వెళ్లేలా జగన్ కార్యాచరణ సిద్ధం చేశారు. గత మూడేళ్లలో తమ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేసిన విధానాల్ని ప్రజలకు చెప్పి, మరోసారి ఆశీస్సులు కోరాలని సూచించారు.
ఇవాళ కేబినెట్ సమావేశం అనంతరం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ మంత్రులతో విస్తృతంగా చర్చించారు. సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వివరించాలని ఆదేశించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. కచ్చితంగా ప్రతీ ఇంటికి మంత్రి, ఎమ్మెల్యే వెళ్లాలని సీఎం ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను వివరిస్తే వెంటనే పరిష‍్కరించాలని సీఎం ఆదేశించారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలకు వద్దకు వెళుతున్నారు. కొన్ని చోట్ల అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. మరికొన్ని చోట్ల కనీస సౌకర్యాల కల్పనపై నిలదీస్తున్నట్టు టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది.
ఏది ఏమైనా గడప గడపకూ వెళ్లి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడం, మరోసారి ఆశీర్వదిస్తే, ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పడం ద్వారా ప్రజాభిమానాన్ని చూరగొనొచ్చనే విశ్వాసం సీఎంలో కనిపిస్తోంది. అంతిమంగా ప్రజలను నమ్ముకుంటే చెడిపోమనే భావన వైఎస్ జగన్‌లో కనిపిస్తోంది.