కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకు వచ్చిన తర్వాత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా విషయాల్లో శ్రమించాల్సి వచ్చింది. తన దశాబ్దాల కల అయిన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన తర్వాత కూడా తన అనుచరవర్గాన్ని కోరుకున్న చోట్లలో సర్దడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక ప్రతిబంధకాలను ఎదుర్కొన్నారు. తనకు అతి సన్నిహితుడు అయిన కేవీపీ రామచంద్రరావును రాజ్యసభకు పంపడానికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా సమయమే పట్టింది.
పార్టీ కోసం వైఎస్ ఎంత చేసినప్పటికీ, అధిష్టానం మాత్రం ఆయనకు అన్ని విషయాల్లోనూ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది లేదు. ఏపీలో సోనియాను చూసి, రాహుల్ ను చూసి ఓటేసిన వాడెవరూ లేకపోయినప్పటికీ పార్టీపై అథారిటీని వారు ఇష్టానుసరం ప్రయోగించారు. రాజ్యసభ సభ్యత్వాల విషయంలోనే వైఎస్ మాట చెల్లుబాటు కావడానికి కొన్ని సార్లు ఆటంకాలు తప్పలేదు.
ఢిల్లీ కోటా అని, సోనియా భజనపరులు అని.. ఏపీ శాసనసభలో వైఎస్ కష్టార్జితాన్ని అడ్డుపెట్టుకుని అధిష్టానం తాము చెప్పిన వారిని నామినేట్ చేయించుకునేది. అధిష్టానంపై వీరవిధేయతతో వైఎస్ కూడా తన జాబితాను విన్నవించుకునే వారే కానీ, కావాల్సిందే అని భీష్మించుకున్నది లేదు. అయాచితంగా దక్కే రాజ్యసభ సభ్యత్వాల విషయంలో కాంగ్రెస్ లోని సోనియా భజనపరులు, కనీసం ఎమ్మెల్యేగా కాదు కదా.. వార్డు మెంబర్ గా గెలవలేని వారు కూడా అప్పట్లో రాజ్యసభ సభ్యులయ్యారు. అలాంటి పరిణామాలన్నింటినీ వైఎస్ ఎలా భరించారనేది ఆశ్చర్యకరమైన అంశమే!
కళ్ల ముందు చూస్తూ ఉండగా.. అలాంటి పరిణామాలు ఎలాంటి వారినైనా అసంతృప్తికే కాదు, తీవ్రమైన ఆగ్రహానికి కూడా గురి చేస్తాయి. తన హయాంలో వైఎస్ ఒకే ఒక రాజ్యసభ సభ్యత్వం విషయంలో పట్టుబట్టినట్టుగా కనిపించారు. అది కేవలం కేవీపీ రామచంద్రరావు విషయంలో మాత్రమే! అది కూడా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగో యేట అవకాశం దక్కింది వైఎస్ కోరుకున్న వ్యక్తికి. అంత వరకూ ఏపీ నుంచి భారీ ఎత్తున రాజ్యసభ సభ్యత్వాలు లభిస్తూ ఉన్నా.. అన్నీ అధిష్టానం కోటాలోనే పోయాయి!
కేవీపీ విషయంలో కూడా వైఎస్ కు అధిష్టానం ఆఖరి నిమిషం వరకూ క్లారిటీ ఇవ్వలేదు. ఆఖరి వరకూ సందేహంలోనే పెట్టి చివరకు ఓకే చేసింది కాంగ్రెస్ హై కమాండ్. ఇలాంటి పోకడలతోనే ఆ తర్వాత కాంగ్రెస్ దేశంలోని చాలా రాష్ట్రాల్లో గల్లంతయ్యిందని ఆ తర్వాతి చరిత్ర స్పష్టంగా చెబుతూనే ఉంది.
మరి వైఎస్ ఇలాంటి విషయాల్లో ఎదుర్కొన్న ఇబ్బందులతో పోలిస్తే ఆయన తనయుడికి అలాంటి ఇబ్బందులు అసలేం లేవని చెప్పాలి! 2014 తర్వాత వైఎస్ జగన్ కు తన తరఫున రాజ్యసభ సభ్యత్వాల అవకాశం వచ్చింది. అయితే మొదట్లోనే జగన్ ఖరాఖండిగా వ్యవహరించారు. విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ఎంపికల విషయంలో ఎలాంటి విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. ఆ తర్వాత పట్టించుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది.
ఏపీలో పార్టీకి రికార్డు స్థాయి అసెంబ్లీ సీట్ల బలం ఉంది. అసెంబ్లీకి ఓడిపోయిన వారికి మండలి అవకాశాలు. ఎమ్మెల్యే టికెట్లను త్యాగం చేసిన వారికి జడ్పీటీసీ చైర్మన్ పదవులు.. ఇలా పేరున్న ప్రతి ఒక్కరికీ ఇలాంటి హోదాలు లభించాయి. దీంతో ప్రత్యేకంగా రాజ్యసభ నామినేషన్ల మీద తీవ్రమైన పోటీ కనిపించడం లేదు.
రాజ్యసభ ఆప్షన్లలో తను కోరుకున్న వారికే అవకాశం ఇచ్చే ఛాన్స్ జగన్ మోహన్ రెడ్డి సొంతమైంది. అధిష్టానం, పార్టీ నేతల ఒత్తిళ్లతో సంబంధం లేకుండా విరివిగా ఉన్న అవకాశాలు జగన్ కు వైఎస్ తో పోలిస్తే చాలా సౌలభ్యకరమైనవి!