మాజీ మంత్రి, విశాఖ నార్త్ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మళ్లీ సొంత గూటికే చేరుకోనున్నారా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. టీడీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు, అలాగే అధిష్టానం పెద్దలకు ఆయన దూరంగా వుంటున్నారు. దీంతో ఆయన వైసీపీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇలాంటి ప్రచారాలు ఎన్నో జరిగినా, గంటా మాత్రం ఏనాడూ ఖండించలేదు.
ఈ నేపథ్యంలో ఇవాళ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో గంటా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీలోనే కొనసాగాలని గంటా నిర్ణయించుకున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. జనవరి 1న నూతన సంవత్సర మొదటి రోజు పురస్కరించుకుని గంటా శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టు తయారు చేయించారు. ఇందులో చంద్రబాబు ఫొటో పెట్టుకోవడంతో గంటా రాజకీయ వైఖరిపై చర్చ మొదలైంది.
అందరూ అనుకున్నట్టుగానే గంటా టీడీపీలో మళ్లీ యాక్టీవ్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. లోకేశ్‌తో మంగళవారం భేటీ కావడంతో గంటా టీడీపీలో కొనసాగడంపై క్లారిటీ వచ్చినట్టైంది. మరో 15 నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో రాజకీయంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని గంటా గ్రహించారు. మరీ ముఖ్యంగా జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయనే సంకేతాలు రావడం, ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో చర్చలు జరిపిన గంటా ….టీడీపీకి రాజకీయ భవిష్యత్ ఉందని నమ్ముతున్నారు.
ఆ కారణమే టీడీపీలోనే కొనసాగేలా గంటా మనసు మార్చిందని చెప్పొచ్చు. ఇదిలా వుండగా టీడీపీ కష్టాల్లో వుంటే… ఏ మాత్రం పట్టించుకోలేదనే ఆగ్రహం గంటాపై టీడీపీ శ్రేణుల్లో వుంది. అయితే తమ వద్దకు వచ్చిన గంటాను కాదనుకుంటే, ప్రత్యర్థుల బలాన్ని పెంచినట్టు అవుతుందని టీడీపీ పెద్దలు కూడా గతాన్ని మరిచిపోయి, కొత్త ప్రయాణాన్ని ఆయనతో కలిసి సాగించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.