సొంత పార్టీ ఎమ్మెల్యేపై అధికార పార్టీ వైసీపీ అనుమాన చూపు చూస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అతను పార్టీలో కొనసాగుతారా? లేదా? అనే చర్చ వైసీపీలో నడుస్తోంది. కొన్ని రోజులుగా పార్టీకి వ్యతిరేకంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీలో ముగ్గురు మహిళల మృతికి కారణమైన ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్‌ను వసంత కృష్ణప్రసాద్ వెనకేసుకొచ్చారు. అతను తనకు స్నేహితుడని, మంచివాడని సర్టిఫికెట్ ఇవ్వడంతో వైసీపీ షాక్‌కు గురైంది.
తాజాగా మరోసారి ఆయన ఘాటు వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే ఎందుకయ్యానా? అని ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. పది మంది రౌడీలను వెంటేసుకుని తిరగడం చేతకాక పాత తరం నాయకుడిలా మిగిలిపోయానంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తన జిల్లాకు చెందిన పాత తరం నాయకుల పేర్లు ప్రస్తావించారు. అలాగే సగటు వ్యక్తులకు సహాయం చేయలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేగా వుంటూ… ఆయన ఈ రకంగా కామెంట్స్ చేయడం సహజంగానే వైసీపీని ఇరకాటంలో పడేస్తోంది.
ఈ నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ భవిష్యత్ వ్యూహంపై వైసీపీ కన్నేసింది. వసంత కృష్ణప్రసాద్ తండ్రి నాగేశ్వరరావు సోమవారం విజయవాడ ఎంపీ కేశినేని నానితో భేటీ కావడంతో కృష్ణప్రసాద్ రాజకీయ పంథాపై మరింత అనుమానం పెంచింది. రాజధాని మార్పు, అలాగే జగన్ కేబినెట్‌లో కనీసం ఒక్క కమ్మ నేతకు కూడా స్థానం కల్పించలేదంటూ ఇటీవల మైలవరం ఎమ్మెల్యే తండ్రి వసంత నాగేశ్వరరావు సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. అయితే తండ్రి వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చారు.
ముఖ్యంగా మంత్రి జోగి రమేశ్‌తో వసంత కృష్ణప్రసాద్‌కు తీవ్ర విభేదాలున్నాయి. మైలవరం నుంచి పోటీ చేయాలని జోగి రమేశ్ ప్రయత్నిస్తున్నారనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నంలో జోగి రమేశ్ ఇల్లు కూడా కట్టుకున్నారు. అక్కడి నుంచే తన రాజకీయ కార్యకలాపాలను ఆయన నిర్వహిస్తున్నారు. అంతేకాదు, మైలవరం నియోజకవర్గంలో జోగి రమేశ్ సిఫార్సు మేరకే డీఎస్పీని ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు తీసుకున్న డీఎస్పీ నేరుగా వెళ్లి మంత్రిని కలిసి విధేయత చాటుకున్నారు.
మరోవైపు ఇటీవల జగన్‌తో మైలవరం ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గ కార్యకర్తలు భేటీ అయ్యారు. తనను గెలిపించాలని కాకుండా, గతం కంటే ఎక్కువ మెజార్టీతో వైసీపీ అభ్యర్థికి విజయం అందించాలని సీఎం జగన్ కోరారని వసంత చెబుతున్నారు. దీంతో తనకు టికెట్ దక్కదనే అనుమానం అతనిలో రోజురోజుకూ పెరుగుతోంది. అప్పటి నుంచి నెమ్మదిగా ప్రభుత్వంపై వ్యతిరేక గళం వినిపిస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే వసంత కృష్ణప్రసాద్ వైసీపీలో కొనసాగరనే అనుమానం అధికార పార్టీ పెద్దల్లో రోజురోజుకూ పెరుగుతోంది. వసంత కృష్ణప్రసాద్ భవిష్యత్‌ను కాలమే నిర్ణయించాల్సి వుంది.