చలసాని శ్రీనివాస్ చౌదరి మళ్లీ తెరపైకి వచ్చారు. గత నాలుగేళ్లుగా ప్రత్యేక, విభజన హామీలేవీ ఆయనకు గుర్తే రాలేదు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం పాదయాత్ర చేస్తాననడం ఆయనకే చెల్లింది. ఏపీకి ప్రత్యేక హోదా సంగతి పక్కన పెడితే… తనతో పాటు మద్దతు ఇచ్చే సీపీఐ రామకృష్ణ తదితర నాయకులకు అధికార హోదా సాధించుకునేందుకు చలసాని తపన పడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేందుకు నారా లోకేశ్ పాదయాత్ర, పవన్‌కల్యాణ్ వాహన యాత్ర చాలవన్నట్టు….చంద్రబాబు కోసం నేను సైతం అని ఆయన అంటున్నారు. హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకూ పాదయాత్ర చేస్తానని చలసాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ చెర నుంచి జనసేన పార్టీ బయటకు రావాలని చలసాని శ్రీనివాస్ చౌదరి కోరారు. పవన్‌కల్యాణ్‌కు పోరాటం చేసే సత్తా వుందని, దేనికీ లొంగరనే సంగతి తెలుసని వ్యూహాత్మకంగా ప్రశంసించారు.
ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పవన్‌కల్యాణ్ సభలకు జనం వస్తారని చలసాని కితాబివ్వడం విశేషం. గతంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం పాచిపోయిన లడ్డు ఇచ్చిందని, అలాగే దక్షిణ భారతదేశానికి మోదీ నేతృత్వంలోని సర్కార్ అన్యాయం చేసిందని పవన్ చేసిన వ్యాఖ్యలను తాజాగా చలసాని గుర్తు చేయడం వెనుక ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోవచ్చు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసి విభజన హామీల కోసం పోరాటం చేయాలని ఈ ఆంధ్రా స్వయం ప్రకటిత మేధావి సూచించడం గమనార్హం. ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా, విభజన హామీల అంశాన్ని నెత్తికెత్తుకోవాలని చలసాని ఆలోచించడం వెనుక చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు లేవని ఎవరైనా నమ్ముతారా? చంద్రబాబు కోసం ఇలా అన్ని రకాల నాయకులు యాక్టీవ్ కావడాన్ని గమనించొచ్చు.