అసమర్థులకు నో చెప్పే సమయమింకా రాలేదా?

తాను ప్రతి నియోజకవర్గంలోనూ విడివిడిగా సర్వేలు చేయిస్తున్నానని.. సర్వేల్లో గెలిచే అవకాశం ఉన్నట్టుగా తేలిన వారికి మాత్రమే మళ్లీ టికెట్లు ఇస్తానని, పనిచేయని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్లు ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్…

తాను ప్రతి నియోజకవర్గంలోనూ విడివిడిగా సర్వేలు చేయిస్తున్నానని.. సర్వేల్లో గెలిచే అవకాశం ఉన్నట్టుగా తేలిన వారికి మాత్రమే మళ్లీ టికెట్లు ఇస్తానని, పనిచేయని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్లు ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుమారు ఏడాదికాలంగా చెబుతూనే ఉన్నారు. 

ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల్లో ఉంటూ వారి వద్ద మంచి మార్కులు సంపాదించుకోవడానికే జగన్ ప్రత్యేకంగా గడపగడపకు కార్యక్రమాన్ని కూడా తీసుకువచ్చారు. అది సరిగా చేయని వారికి ఎప్పటికప్పుడు క్లాస్ పీకుతున్నారు. అయితే అసమర్థుల విషయంలో ఇంకా ఎన్నాళ్లు ఆగుతారు? వారికి టికెట్లు ఇవ్వడం లేదని తెగేసి చెప్పేస్తే ఏం అవుతుందని జగన్ భయపడుతున్నారు? అనే ప్రశ్నలు పార్టీ శ్రేణుల్లో ఉదయిస్తున్నాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాగానే ఉన్నది. కేవలం సంక్షేమమంత్రం ఒక్కటే ఈసారి తమ గెలుపు మంత్రం అని వారు నమ్ముతున్నారు. ముందస్తు ఎన్నికలు అని ప్రతిపక్షాలు తమ అవసరం కొద్దీ పుకార్లు పుట్టిస్తున్నాయి గానీ.. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పూర్తిగా అయిదేళ్లు అనుభవించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలనేది జగన్ ఉద్దేశం. 

అయితే ప్రతిపక్షాలు ఇప్పటికే ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. అభ్యర్థుల ప్రకటన, గుర్తులతో ప్రచారం మాత్రం జరగడం లేదు. తతిమ్మా అన్ని రకాలుగానూ ఎన్నికల యుద్ధవాతావరణమే ప్రతిపక్షాల సన్నాహాల్లో కనిపిస్తోంది. జగన్ కూడా తన శ్రేణులను సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. 

ప్రభుత్వం ప్రజలతో మమేకం అయినంతగా ప్రజలతో మమేకం కాకపోవడం, విపరీతమైన అవినీతికి పాల్పడడం, ప్రజలతో ప్రమేయం ఉండే చిన్న చిన్న స్థానిక విషయాల్లో కూడా అవినీతికి కబ్జాలకు దందాలకు పాల్పడుతూ తాము భ్రష్టుపట్టిపోవడం, తమ స్వార్థ సంకుచిత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పార్టీని ఇరుకునపెట్టే విమర్శలతో తిరుగుబాటుగా చెలరేగుతున్నవారు.

ఇత్యాది రూపాల్లో మళ్లీ గెలవడం అసాధ్యం అనిపించేలా తయారైన సిటింగ్ ఎమ్మెల్యేలు చాలా మందే ఉన్నారు. వారు మళ్లీపోటికి పనికిరారు అనే సంగతి సీఎం దృష్టిలో కూడా ఉంది. పనితీరును మార్చుకోవడానికి సీఎం పలుమార్లు అవకాశం ఇచ్చినా వారు ఉపయోగించుకున్నది కూడా లేదు. 

ఇలాంటి అసమర్థులకు తెగేసి చెప్పేసి.. వచ్చే ఎన్నికలకు ఆ నియోజకవర్గాల్లో మరొకరు పోటీచేస్తారని స్పష్టం చేయడానికి సీఎం జగన్ ఎందుకు ఇంకా జాగు చేస్తున్నారనేది పార్టీలో చాలామందికి అర్థం కాని సంగతి. ఉదాహరణకు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వంటి వారి విషయంలో మాత్రం జగన్ స్పష్టత ఇచ్చారు. ఎమ్మెల్యే ఉండగా.. వేరొక ఇన్చార్జిని నియమించారు. అలా అసమర్థులున్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఎందుకు చేయడంలేదో తెలియదు. 

ఎమ్మెల్యేల మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, పార్టీ మీద వ్యతిరేకతగా పరిణమించేలోగా సీఎం నిర్ణయం తీసుకోవాలి కదా అనేది శ్రేణుల కోరిక. ఆనం వంటి ఓవరాక్షన్ చేస్తున్న ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు స్పందించడం లేదన్నది కూడా పార్టీలో కార్యకర్తలకు సందేహం. జాగు చేసే కొద్దీ నష్టం పెరుగుతుందని వారు అనుకుంటున్నారు.